క్రికెట్ ఆస్ట్రేలియా భారత్‌తో టెస్ట్ సిరీస్ కోసం గురువారం ఉదయం తమ టీమ్‌ను ప్రకటించింది. మొత్తం 17 మంది సభ్యులను ఎంపిక చేయగా అందులో దేశవాళీ క్రికెట్‌లో అదరగొడుతోన్న ఐదుగురు కొత్త ఆటగాళ్లకు అవకాశం కల్పించింది. షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో ఆటగాళ్ల ప్రతిభను ఆధారంగా చేసుకుని యువ ప్లేయర్స్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ కొత్త క్రికెటర్లలో విల్ పుకోవిస్కి అనే విక్టోరియా టీమ్ ఓపెనర్ ప్రస్తుతం సంచలనంగా మారాడు. షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో అతడు వరుసగా రెండు మ్యాచ్‌ల్లో డబుల్ సెంచరీలు బాది 495 రన్స్ చేశాడు. అతని బ్యాటింగ్ యావరేజ్ 247.5 అంటేనే ఏ స్థాయిలో ఆడాడో అర్థం చేసుకోవచ్చు.
దీంతో సెలక్షన్ కమిటీ అతడిని డేవిడ్ వార్నర్‌కు సరైనా జోడీగా పనికొస్తాడని రెండో ఓపెనర్‌గా ఎంపిక చేసింది. మరోవైపు వెస్టర్న్ ఆస్ట్రేలియా జట్టులోని కామరూన్ గ్రీన్‌ను కూడా సెలక్ట్ చేశారు. అతడు కూడా తన బ్యాటింగ్‌తో సెలక్టర్లను ఆకట్టుకున్నాడు. 72.6 యావరేజ్‌తో 363 పరుగులు చేశాడు. వారిద్దరితో పాటు లెగ్ స్పిన్నర్ మిఛెల్ స్వెప్‌సన్‌ను టెస్టుల కోసం ఎంపిక చేశారు సెలక్టర్లు. షెఫ్పర్డ్ షీల్డ్ టోర్నమెంట్‌లో స్వెప్‌సన్ 23 వికెట్లు తీశాడు. సీనియర్ స్పిన్నర్ నాథన్ లియాన్‌కు కూడా అవకాశం కల్పించారు.
సీనియర్లు, జూనియర్ల కలయికతో ఆసిస్ జట్టు బలంగా కనిపిస్తోంది. ఇండియా మెన్స్ క్రికెట్ టీమ్.. రెండున్నర నెలల పాటు ఆస్ట్రేలియాలో సుదీర్ఘ పర్యటనను చేపట్టబోతోంది. ఈ పర్యటనలో భారత్, ఆసిస్ జట్లు మూడు వన్డే లు, మూడు టీ20, నాలుగు టెస్ట్ మ్యాచ్‌లను ఆడనున్నాయి. టిమ్‌పైన్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా డిసెంబర్ 17 నుంచి అడిలైడ్ వేదిక భారత్‌తో టెస్టు సిరీస్ ఆడనుంది. మొదటి టెస్ట్ డిసెంబర్ 17 నుంచి 21 (అడిలైడ్), రెండో టెస్ట్ డిసెంబర్ 26 నుంచి 30 (మెల్‌బోర్న్), మూడో టెస్ట్ జనవరి 7 నుంచి 11 (సిడ్నీ), నాలుగో టెస్ట్ జనవరి 15 నుంచి 19 (బ్రిస్బేన్)వరకు జరగనున్నాయి.
ఆస్ట్రేలియా టెస్టు టీమ్: టిమ్‌పైన్(కెప్టెన్), జేమ్స్ పాటిన్‌సన్, స్టీవ్‌స్మిత్, మిచెల్ స్టార్క్, విల్ పుకోవిస్కి, మిచెల్ స్వీప్‌సన్, మాథ్యూవేడ్, డేవిడ్‌వార్నర్, సీన్ అబ్బాట్, కామరూన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, జోబర్న్స్, పాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్, నాథన్ లయన్, మార్నస్ లబుషేన్, మైఖేల్ నాసర్.