ఐపీఎల్-2020: తాజా సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ భారీ విజయాన్ని అందుకుంది. ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై మంగళవారం రాత్రి ఏకంగా 88 పరుగుల తేడాతో గెలుపొందింది. మ్యాచ్‌లో తొలుత ఓపెనర్లు సాహా (87: 45 బంతుల్లో 12×4, 2×6), డేవిడ్ వార్నర్ (66: 34 బంతుల్లో 8×4, 2×6) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 2 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో స్పిన్నర్ రషీద్ ఖాన్ (3/7) దెబ్బకి తేలిపోయిన ఢిల్లీ 131 పరుగులకే ఆలౌటైంది. తాజా సీజన్‌లో 12వ మ్యాచ్ ఆడిన హైదరాబాద్‌కి ఇది ఐదో గెలుపుకాగా.. ఢిల్లీకి ఐదో ఓటమి.
220 పరుగుల ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ ఏ దశలోనూ గెలుపు దిశగా సాగలేదు. ఓపెనర్ శిఖర్ ధావన్ (0) తొలి ఓవర్‌లోనే ఔటైపోగా.. బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకు వచ్చిన స్టాయినిస్ (5), సిమ్రాన్ హిట్‌మెయర్ (16) తేలిపోయారు. ఈ దశలో కాస్త బ్యాట్ ఝళిపించిన రహానె (26: 19 బంతుల్లో 3×4, 1×6) కూడా రషీద్ ఖాన్ బౌలింగ్‌లో వికెట్ల ముందు ఎల్బీడబ్ల్యూగా దొరికిపోయాడు. దాంతో.. 6.5 ఓవర్లు ముగిసే సమయానికి ఢిల్లీ 55/4తో ఓటమికి చేరువైంది. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (7), అక్షర్ పటేల్ (1), కగిసో రబాడ (3)లతో కలిసి రిషబ్ పంత్ (36: 35 బంతుల్లో 3×4, 1×6).. మిడిల్ ఓవర్లలో ఢిల్లీ ఓటమి అంతరాన్ని తగ్గించే ప్రయత్నం చేశాడు. కానీ.. లాభం లేకపోయింది. జట్టు స్కోరు 103 వద్ద పంత్ ఔటవగా.. ఆఖర్లో తుషార్ దేశ్‌పాండే (20 నాటౌట్: 9 బంతుల్లో 2×4, 1×6) కాస్త బ్యాట్ ఝళిపించాడు.
A well deserved victory for @SunRisers as they win by 88 runs.#Dream11IPL pic.twitter.com/PqlaF6IolV
— IndianPremierLeague (@IPL) October 27, 2020
మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దాంతో.. హైదరాబాద్ ఇన్నింగ్స్ ప్రారంభించిన డేవిడ్ వార్నర్- సాహా జోడీ తొలి ఓవర్ నుంచే బాదుడు మొదలెట్టింది. ఈ క్రమంలో రబాడాని కూడా వదల్లేదు.. అతను వేసిన ఓ ఓవర్‌లో వార్నర్ నాలుగు ఫోర్లు, ఒక సిక్స్ కొట్టడంతో ఏకంగా 22 పరుగుల్ని హైదరాబాద్ పిండుకుంది. అదే దూకుడులో కేవలం 25 బంతుల్లోనే వార్నర్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. జట్టు స్కోరు 107 వద్ద వార్నర్‌ని అశ్విన్ ఔట్ చేసేశాడు. అయినప్పటికీ సాహా వెనక్కి తగ్గలేదు. స్పిన్నర్లు అశ్విన్, అక్షర్ పటేల్ బౌలింగ్‌లో క్రీజు వెలుపలికి వచ్చి మరీ భారీ షాట్లు ఆడేశాడు. అదే ఊపులో సెంచరీ చేసేలా కనిపించిన సాహాని నోర్తేజ్ ఔట్ చేయగా.. స్లాగ్ ఓవర్లలో మనీశ్ పాండే (44 నాటౌట్: 31 బంతుల్లో 4×4, 1×6), విలియమ్సన్ (11 నాటౌట్: 10 బంతుల్లో 1×4) కాస్త నెమ్మదిగా ఆడారు.