మాజీల అడవి బాట.. జనజీవనంలో ఇమడలేక మళ్లీ తుపాకీ పట్టేందుకే మొగ్గు..?

పచ్చని అడవుల్లోనే తమ జీవితాలను కొనసాగించేందుకు మాజీ మావోయిస్టులు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. అడవులను వీడి జనజీవన స్రవంతిలో కలిసిన మాజీ మావోయిస్టుల్లో కొందరు మళ్లీ పోరుబాట పట్టాలనే ఆలోచనతో ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలుకాకపోవడం, బయట జీవనం భారంగా మారడం, సమాజంలో కొనసాగుతున్న అవమానాలు, రాజకీయ నాయకులు, అవినీతి అధికారుల తీరుపై అసంతృప్తి వంటి కారణాలతో కొందరు మాజీలు తీవ్ర అంతర్మథనానికి గురవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.

ఒకప్పుడు ప్రజల సమస్యల పరిష్కారం కోసం సాయుధ పోరాటంలో పాల్గొన్న తాము, ఇప్పుడు సాధారణ జీవితంలో ఉంటూ ఏమీ చేయలేకపోతున్నామనే అసంతృప్తి వారిలో వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఉన్న మావోయిస్టు పార్టీలోకి కాకుండా, సొంతంగా ఒక నూతన దళాన్ని లేదా విభాగాన్ని ఏర్పాటు చేసుకునే అంశంపై మాజీ మావోయిస్టుల మదిలో సరికొత్త ఆలోచనలు సాగుతున్నట్లు తెలుస్తోంది. బందూక్ చేతబట్టి మళ్లీ పోరుబాట పట్టేందుకే ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.

ప్రజాక్షేత్రంలో అవమానాలు, అవినీతిపై అసంతృప్తితో అంతర్ధానం కావాలని భావిస్తున్న వీరు.. నాటి సికాస తరహాలో ఉద్యమ నిర్మాణానికి అవసరమైన చర్యలపై దృష్టి సారించినట్లు భోగట్టా. తిరిగి అడవి బాట పట్టే క్రమంలో ఆయుధాల పంపిణీ మరియు దంపుల ప్రస్తావనతో సీనియర్ వర్గాల వద్దకు మాజీలు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో తొందరపాటు నిర్ణయాలు వద్దు అంటూ కొంతమంది కీలక నేతలు వారిని వారిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో చోటుచేసుకుంటున్న ఈ పరిణామాలు ఉమ్మడి రాష్ట్రాల సరిహద్దుల్లో అత్యంత ఆసక్తికరంగా మారాయి.