ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నెల్లూరు జిల్లాకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడి రాజకీయాలు ఎప్పుడూ సీనియర్ నాయకుల చుట్టూనే తిరుగుతుంటాయి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ నేత, ఎండోమెంట్ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చుట్టూ నెల్లూరు రాజకీయం ఆసక్తికరంగా మారింది. నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం, ఉమ్మడి రాష్ట్రంలోనే కీలకమైన బడ్జెట్ ప్రవేశపెట్టిన చరిత్ర ఉన్న ఆనంకు.. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో, సొంత జిల్లాలో ఆశించిన స్థాయిలో వాల్యూ దక్కడం లేదనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో బలంగా వినిపిస్తోంది.
జిల్లా రాజకీయాలపై ఆయన పట్టు సడలుతోందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం నెల్లూరు జిల్లాలో ఇతర కూటమి నేతల ఆధిపత్యం పెరగడమేనని విశ్లేషకులు చెబుతున్నారు. నెల్లూరు సిటీ, రూరల్ నియోజకవర్గాలకు చెందిన కీలక నేతలు, ఒక బలమైన ఎంపీ లోకల్ గా చక్రం తిప్పుతుండటంతో ఆనం కేవలం తన నియోజకవర్గానికి మాత్రమే పరిమితం కావాల్సి వస్తోంది. జిల్లాకు సంబంధించిన కీలక నిర్ణయాలు, అధికారుల బదిలీలు, నామినేటెడ్ పదవుల భర్తీ వంటి విషయాల్లో ఆనం సిఫార్సులకు పెద్దగా ప్రాధాన్యత దక్కడం లేదని తెలుస్తోంది.
సీనియర్ మంత్రిగా జిల్లా అంతటా తన ముద్ర వేయాలని ఆయన భావించినప్పటికీ, మిగిలిన ప్రజాప్రతినిధులు ఆయనను పక్కన పెట్టి నేరుగా అధిష్టానంతోనే పనులు చేయించుకుంటుండటం ఆనం వర్గానికి తీవ్ర అసంతృప్తిని మిగులుస్తోంది. మరోవైపు ఆనం నిర్వహిస్తున్న దేవాదాయ శాఖ కూడా ఆయనకు రాజకీయంగా పెద్దగా కలసిరావడం లేదనే టాక్ నడుస్తోంది. హోం, మున్సిపల్, నీటిపారుదల వంటి కీలక శాఖలు ఉంటే జిల్లాలో పట్టు సాధించడం సులభం అవుతుంది. కానీ ప్రస్తుత శాఖ వల్ల కేవలం ఆలయాల వ్యవహారాలకే పరిమితం కావాల్సి వస్తోంది.
అలాగే ఇటీవల జిల్లాలో జరిగిన కొన్ని ప్రభుత్వ కార్యక్రమాలు, సమీక్షా సమావేశాలలో కూడా ప్రోటోకాల్ పరంగా ఆనంకు తగిన గుర్తింపు దక్కడం లేదని, జూనియర్ ఎమ్మెల్యేలే ఇక్కడ మెయిన్ లీడర్లుగా ప్రొజెక్ట్ అవుతున్నారని గ్రౌండ్ రిపోర్ట్ చెప్తోంది. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నెల్లూరు జిల్లా కూటమి రాజకీయాల్లో సీనియర్ నేత ఆనం రామనారాయణ రెడ్డి మార్క్ పూర్తిగా తగ్గిపోయిందని, ఆయనకు జిల్లా వ్యవహారాల్లో అసలు వాల్యూ లేకుండా పోయిందనే విశ్లేషణలు నిజమేననిపిస్తోంది.