బెజవాడలో రంగంలోకి ఏబీవి ఇంటెలిజెన్స్ నెట్‌వర్క్‌..?

గ్రేటర్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న వేళ నగర రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్, గ్యాస్ సిలిండర్ గుర్తుపై స్వతంత్ర మేయర్ అభ్యర్థిగా బరిలో ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక పవర్‌ఫుల్ పోస్ట్ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. గురువారం రాత్రి విజయవాడ నగరంలో మద్యం ఏరులై పారిందని, నోట్ల కట్టల వరద వచ్చిందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటుకు 500 రూపాయలు పంచితే, తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి ఏకంగా 1000 రూపాయలు పంపిణీ చేసిందని, వీటికి తోడు చీప్ లిక్కర్ క్వార్టర్ అదనంగా ఇచ్చారంటూ క్షేత్రస్థాయిలో జరుగుతున్న దారుణాలను బట్టబయలు చేశారు.

ఈ ఓట్ల కొనుగోలు వ్యవహారంలో మద్యం మత్తులో ఉన్న కొందరు తప్పతాగిన మూకలు తన ప్రచార వాహనాలను కూడా ధ్వంసం చేశాయని ఏబీ వెంకటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ నగరంలో దశాబ్దాలుగా ఎన్నికల సమయంలో ఇదే రకమైన విష సంస్కృతి నడుస్తోందని ఆయన మండిపడ్డారు. ఈ అక్రమాలపై తాను జరిగిన వెంటనే ‘112’ ఎమర్జెన్సీ నంబర్‌కు ఫోన్ చేసి కంప్లైంట్ చేశానని, చూద్దాం పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో అని సవాల్ విసిరారు. నగరంలో ఈ డబ్బు, మద్యం సంస్కృతి పోవాలంటే గ్యాస్ సిలిండర్ గుర్తుపై ఓటేసి నన్ను మేయర్ గా గెలిపించాలని, లేకపోతే ఈ అవినీతి వ్యవస్థను మీరే పెంచి పోషించిన వాళ్లవుతారంటూ విజయవాడ ఓటర్లను హెచ్చరించారు.

అయితే, ఈ తాజా పోస్ట్‌తో అధికార కూటమి మరియు విపక్ష పార్టీలలో తీవ్ర గుబులు మొదలైంది. గతంలో ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగం అధిపతిగా సుదీర్ఘకాలం పనిచేసిన ఏబీ వెంకటేశ్వరరావు.. నగరంలో ఏ డివిజన్‌లో, ఏ వీధిలో, ఎవరు ఎంతెంత డబ్బు పంచుతున్నారనే విషయాలపై పక్కా సమాచారంతో ఈ పోస్ట్ పెట్టడం విశేషం. గతంలో తనతో పాటు ఇంటెలిజెన్స్ వింగ్‌లో అత్యంత సన్నిహితంగా, నమ్మకంగా పనిచేసి రిటైర్ అయిన కొందరు మాజీ పోలీసు అధికారులను, ప్రైవేట్ నిఘా సిబ్బందిని ఆయన విజయవాడ ఎన్నికల క్షేత్రంలో దించినట్లు పొలిటికల్ సర్కిల్స్‌లో గట్టిగా వినిపిస్తోంది.

ఈ రహస్య ఇంటెలిజెన్స్ నెట్‌వర్క్ ద్వారానే నగరంలో రాత్రి వేళల్లో జరుగుతున్న ప్రతి లూజ్‌మనీ మూవ్‌మెంట్‌ను, లిక్కర్ సప్లైని ఆయన గ్రౌండ్ లెవెల్ నుండి ట్రాక్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక మాజీ టాప్ కాప్ అభ్యర్థిగా ఉండి, పక్కా సమాచారంతో లైవ్ అప్‌డేట్స్ ఇస్తుండటంతో ఎన్నికల అధికారులు, పోలీసులు కూడా అలర్ట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఏబీ వెంకటేశ్వరరావు వేసిన ఈ ఇంటెలిజెన్స్ స్కెచ్‌తో అక్రమాలకు తెరలేపిన ప్రధాన పార్టీల లీడర్లకు ఇప్పుడు ముచ్చెమటలు పడుతున్నాయి.