తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు మునుపటిలా లేదు. ఆయనలో మార్పు కొట్టొచ్చినట్టు కనబడుతోంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాలకు ముందు ఒకలా ఉన్న ఆయన ఫలితాల తర్వాత ఇంకోలా ఉన్నారు. అందుకు కారణం ఎన్నికల్లో బీజేపీ ఊహించని రీతిలో పుంజుకోవడమే. 2016 ఎన్నికల్లో 4 స్థానాలతో సరిపెట్టుకున్న బీజేపీ ఈసారి ఏకంగా 48 స్థానాలు చేరుకున్నారు. గతంలో 99 స్థానాలు సాధించిన తెరాస మాత్రం 56 స్థానాలతో సరిపెట్టుకుంది. ఈ ఫలితాలతో 100 సీట్లు సాధించాలన్న కేసీఆర్ కల ఆవిరైపోయింది. ఆ కలతో పాటే ప్రతిపక్ష పార్టీపై ఆయన దృష్టి కోణం కూడ మారింది.
గతంలో కేసీఆర్ ప్రతిపక్షాల పేరెత్తితే అవి అసలు పార్టీలే కాదన్నంత చులకనగా మాట్లాడేవారు. కేసీఆర్ ను ఢీకొట్టడం వారి తరం కాదన్నట్టు వ్యవహరించేవారు. బీజేపీ ఇచ్చిన వరుస షాకులతో ఆ మబ్బులన్నీ తొలగిపోయాయి. ఇంతకుముందు అన్ని ఎన్నికల్లోనూ ఏకపక్షంగా విజయాలు సాధిస్తూ రావడంతో రాజకీయంగా ఎవరితోనూ రాజీపడాల్సిన అవసరం రాలేదు ఆయనకు. అది కాంగ్రెస్ అయినా, టీడీపీ అయినా, బీజేపీ అయినా ట్రీట్మెంట్ మాత్రం ఒకేలా ఉండేది. కానీ బీజేపీ పరిస్థితులను తలకిందులు చేసేసింది. కేసీఆర్ ఎన్డీయేకు ప్రత్యామ్నాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుచేయాలని అనుకున్నారు. మమతా బెనర్జీ, కుమారస్వామి లాంటి కొందరు నేతలను కలిసి హడావుడి చేశారు. అయితే ఇప్పుడు తెలంగాణలో తన పరిస్థితి ఎలా ఉందో బెంగాల్ రాష్ట్రంలో మమతా పరిస్థితి అలాగే ఉంది. బీజేపీ దూకుడు ముందు నిలవలేకున్నారు ఆమె.
అందుకే కేసీఆర్ కొన్నాళ్ళు థర్డ్ ఫ్రంట్ ఊసు పక్కనపెట్టి రాజకీయంగా బలపడేందుకు ట్రై చేస్తున్నారు. అందుకే ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలను కలిశారు. అయితే ఈ కలయికలో పరమార్థం మాత్రం కేసీఆర్ మోదీతో చేతులు కలపడమేనని, గతంలో మాదిరి గిల్లికజ్జాలు పెట్టుకోకుండా పరస్పర సహకారంతో ముందుకు సాగడమేనని, థర్డ్ ఫ్రంట్ ఇక ఉండబోదని కాంగ్రెస్ నేతలు, ఇంకొందరు అంటున్నారు. కానీ అలాంటిదేం ఉండదని, కేసీఆర్ బీజేపీకి తలవంచడమనేది జరగని పని అని, రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఆయన ఢిల్లీ పెద్దలను కలిశారని అంతేకానీ మోదీకి అనుకూలంగా మారిపోలేదని తెరాస అభిమానులు వాదిస్తున్నారు.
మరి ఈ పరిణామాలన్నింటినీ చూశాక సామాన్య జనానికి ఏమనిపిస్తోందో తెలుసుకోవాలనే ప్రయత్నంతోనే ఈ అభిప్రాయ సేకరణ చేస్తున్నాం. మీ అభిప్రాయం ఏమిటో ఈ కింది పోల్ ద్వారా తెలియజేయండి.
[yop_poll id=”6″]