ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మొత్తం మూడు రాజధానుల అంశం చుట్టూ తిరుగుతున్నాయి. ఈ నిర్ణయాన్ని కొంతమంది సపోర్ట్ చేస్తుంటే ఇంకొంతమంది వ్యతిరేకిస్తున్నారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి రైతులు చేస్తున్న ధర్నాలు నిన్నటికి మూడు వందల రోజులకు చేరుకుంది. ఈ ధర్నాలకు, ఉద్యమాలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మొదటి నుండి కూడా పూర్తి మద్దతునిస్తూ మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. అయితే తాజాగా ఉద్యమం మూడు వందల రోజులకు చేరిన సంధర్బంగా రాష్ట్రమంతా ధర్నాలు చెయ్యాలని చంద్రబాబు నాయుడు టీడీపీ నాయకులకు, రైతులకు పిలుపునిచ్చారు. అయితే ఈ పిలుపును రైతులే కాదు టీడీపీ నేతలు కూడా పట్టించుకోలేదు.
రైతులకు మూడు రాజధానులు ఇష్టమేనా !
మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ధర్నాలు చెయ్యమని చంద్రబాబు నాయుడు పిలుపునిస్తే దాన్ని రైతులే కాదు టీడీపీ నేతలు కూడా పట్టించుకోలేదని, దీన్ని బట్టి చూస్తే రైతులకు, టీడీపీ నేతలకు కూడా మూడు రాజధానుల నిర్ణయానికి మద్దతు తెలుపుతున్నట్లు అర్ధమవుతుందని వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. మూడు రాజధానుల నిర్ణయంపై టీడీపీ చేయాలనుకుంటున్న ఈ ధర్నాలు, ఉద్యమాలు ప్లాప్ అయ్యాయని, బాబు పిలుపు ఇచ్చినా కూడా ఎవ్వరు పట్టించుకోవడం లేదని బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు.
ప్రభుత్వం రైతుల పట్ల కనికరించదా!
అమరావతి రైతుల ఉద్యమం ప్లాప్ అయ్యిందో హిట్ అయ్యిందో పక్కన పెడితే రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన వారిపై ప్రభుత్వం ప్రవర్తిస్తున్న తీరు మాత్రం చాలా తప్పు. కనీసం వాళ్ళ వాదనను వినడానికి కూడా వాళ్లకు సీఎం జగన్మోహన్ రెడ్డి సమయం ఇవ్వడం లేదు. ప్రతిరోజు ఎంతోమంది పనికిరాని నాయకులను, వ్యక్తులను కలవడానికి సమయం ఇచ్చే రైతులతో చర్చలు జరిపి వాళ్ళనేందుకు తృప్తిపరచలేకపోతున్నారో అర్ధం కావడం లేదు. ఇప్పటికే మూడు వందల రోజులు రైతులు తమ పనులను వదులుకోయి అక్కడ కూర్చొని ధర్నాలు చేస్తూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతులను కూడా టీడీపీ నేతలు నడిపిస్తున్నారని వైసీపీ ప్రభుత్వం అనుకుంటూ వాళ్ళను ఇలా కనీసం చర్చలకు కూడా ఆహ్వానించకుండా అవమానపరచడం చాలా తప్పు. రానున్న రోజుల్లోనైన ప్రభుత్వం ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తుందో వేచి చూడాలి.