YSRCP Leaders : గడప గడపకూ వైఎస్సార్సీపీ.. అంటూ వైసీపీ ప్రజా ప్రతినిథులు, ఇతర ముఖ్య నేతలు జనం వద్దకు వెళుతున్నారు. తాము అధికారంలోకి వచ్చాక ప్రజలకు అన్నీ చేసేశామని వైసీపీ చెప్పుకుంటోంది. ఇళ్ళ పట్టాల దగ్గర్నుంచి, సంక్షేమ పథకాల వరకు.. అన్నీ చేసేస్తున్నామనీ, ప్రజలు సంతోషంగా వున్నారనీ వైసీపీ నేతలు చెబుతున్న విషయం విదితమే.
ఎంత గొప్ప ప్రభుత్వాలొచ్చినా, ప్రజల్ని సంపూర్ణంగా సంతోషపెట్టే పాలన అనేది ఇంతవరకూ జరగలేదు. ఇకపైనా జరగబోదు. దానికి కారణాలు అనేకం. రాజకీయ పార్టీలు రాజకీయాలే చేస్తాయి. ఆ రాజకీయ పార్టీలే అధికారంలోకి వస్తాయి తప్ప, ఏం చేసినా అది రాజకీయ కోణంలోనే.
రాష్ట్రంలో గూడు లేని జనం వున్నారు.. రెక్కాడినా డొక్కాడని బతుకులున్నాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల లాభమెంత.? అన్న విషయాన్ని పక్కన పెడితే, ధరల పెరుగుదల.. పన్నుల పోటు.. సామాన్యుడిని తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది.
అవీ ఇవీ.. అన్నీ పెరిగాయ్. దాంతో, ప్రజల నుంచి సహజంగానే ప్రజా ప్రతినిథుల పట్ల వ్యతిరేకత పెరుగుతుంది. ఆ వ్యతిరేకతే నిరసన సెగల రూపంలో ప్రజా ప్రతినిథులకు ఎదురవుతోంది. గడప గడపకు వెళుతున్న ప్రతి ప్రజా ప్రతినిథీ ఈ సెగ ఎదుర్కొంటున్నారు.
అయితే, గడప గడపకూ వైఎస్సార్సీ ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నామనీ, వాటిని పరిష్కరిస్తామనీ వైసీపీ నేతలు చెబుతున్నారు. పరిష్కారమైతే సరే సరి, లేకపోతే.! అంతే సంగతులు.