ఏంటీ రంగుల గోల.? వైసీపీ ప్రభుత్వమెందుకు చేస్తోందీ తప్పిదం.?

ఏ రాజకీయ పార్టీ అధికారంలో వున్నా, సంక్షేమ పథకాల కోసం చేసే ఖర్చు ప్రభుత్వ ఖజానా నుంచే. మరి, ఆ సంక్షేమ పథకాలకు ఆయా పార్టీల రంగులెందుకు.? ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులెందుకు.? ఈ రంగుల పైత్యం ఇప్పుడు పుట్టింది కాదు. చంద్రబాబు హయాంలో అన్నిటికీ పసుపు రంగు పులిమేశారు. దాన్ని కొనసాగిస్తూ, వైసీపీ YSRCPప్రభుత్వం.. తమ పార్టీ జెండా రంగుల్ని అన్నిటికీ పులిమేస్తోంది.

వైఎస్ జగన్ సర్కార్, ఈ రంగుల హంగామా కారణంగా పలు మార్లు న్యాయస్థానాల్లో మొట్టికాయలు తినాల్సి వచ్చింది. వ్యవహారం సుప్రీంకోర్టుదాకా వెళ్ళగా, అక్కడా వైసీపీ ప్రభుత్వానికి చీవాట్లు తప్పలేదు. వైసీపీ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా అధికారులు ఎందుకు వ్యవహరిస్తున్నారు.? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న. లేదూ, వైసీపీ పెద్దలే రంగుల విషయంలో అధికారులను ఇరకాటంలో పడేసేలా వ్యవహరిస్తున్నారా.? అన్నదీ ఇంకో చర్చ.

కారణం ఏదైతేనేం, ప్రతిసారీ మొట్టికాయలంటే అది వైసీపీ సర్కారుకి అస్సలు మంచిది కాదు. తాజాగా, రాష్ట్ర ప్రభుత్వం, ‘ఇకపై ఏ ప్రభుత్వ భవనానికీ వైసీపీ రంగులు వేయబోం..’ అని ప్రమాణ పత్రం న్యాయస్థానంలో దాఖలు చేసిందట. సో, ఇకపై వైసీపీ రంగుల పేరుతో రాష్ట్ర ప్రభుత్వానికి పెద్దగా సమస్యలు వుండకపోవచ్చు. ఎందుకంటే, అసలు ఆ రంగులు ప్రభుత్వ పరంగా వాడకమే జరగదన్నమాట.

కాగా, సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా వైసీపీ రంగులు తొలగించాలని ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తోంది. కొన్ని ధృవపత్రాల మీద ముఖ్యమంత్రి ఫొటో ఎందుకు.? అన్న ప్రశ్న కూడా తెరపైకొస్తోంది. మరి, వీటిపై రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో.. అధికార పార్టీ ఏమంటుందో.

ఒక్కటి మాత్రం నిజం.. ప్రజలకు మేలు చేసేలా సంక్షేమ పథకాల్ని పెద్దయెత్తున అమలు చేస్తున్న వైఎస్ జగన్ సర్కార్, వాటిని ప్రజల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయేలా చేయగలిగింది. అలాంటప్పుడు, ఈ రంగులతో అదనపు పబ్లిసిటీ అవసరమా.?