అసలే సంక్షోభంలో ఉన్న తెలుగుదేశం పార్టీ మీద ప్రత్యర్థి పార్టీలు రచిస్తున్న యాక్షన్ ప్లాన్స్ మరింత తెలుగు తమ్ముళ్ళను మరింత ఆందోళనలోకి నెడుతున్నాయి. ఇప్పటికే ప్రధాన ప్రత్యర్థి వైసీపీ అమలుచేస్తున్న ఆపరేషన్ ఆకర్ష్ తో సతమతమవుతుండగా కొత్తగా టీడీపీ పని పట్టడానికి బీజేపీ రంగంలోకి దిగింది. టీడీపీలో పదవిలో ఉన్న నేతలే ప్రధానంగా వైసీపీ, బీజేపీలు పథక రచన చేస్తున్నాయని రాజకీయ వర్గాల్లో టాక్ వినబడుతోంది. ఈ వాదనకు బలాన్నిచ్చే అనేక పరిణామాలు గతంలో చోటుచేసుకోవడంతో వైసీపీ, బీజేపీల ఉమ్మడి ప్లాన్ నిజమేనని అనిపిస్తోంది.
ఆ ప్లాన్ ఏమిటంటే టీడీపీ నేతల్ని మెల్లగా భారతీయ జనతా పార్టీలోకి మళ్లించడం. ఇప్పటికే బీజేపీ కొత్త అధ్యక్షుడు సోము వీర్రాజు, జాతీయ కార్యదర్శి ఇద్దరూ కలిసి తమకు ప్రధాన ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీనేనని ప్రకటించేశారు. అంటే టీడీపీని నిర్వీర్యం చేసి ప్రతిపక్ష స్థానాన్ని ఆక్రమించాలనేది బీజేపీ ప్రధాన ఉద్దేశ్యం. ఈ లక్ష్యం కోసం భాజాపా వైసీపీతో చేతులు కలుపుతోందనేది ప్రజెంట్ ట్రేండీ టాక్. చేతులు కలపడం అంటే బహిరంగంగా కాదు… తెర వెనుక స్నేహం అన్నమాట. ఈ స్నేహానికి ఒకే ఒక్క ఎజెండా టీడీపీని పూర్తిగా కషాయ దళంగా మార్చడం.
ఈ పనిలో ప్రధాన సూత్రదారులు, వ్యవహారాలు చక్కబెట్టేవారు వైసీపీ నేతలేనట. బయటకు రావడం లేదు కానీ టీడీపీ నుండి వైసీపీలోకి రావాలని చాలామంది లీడర్లు ట్రై చేస్తున్నారు. కానీ వైసీపీ కండువా కప్పుకోవాలంటే పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. కానీ అలా చేస్తే అస్సలు విలువ ఉండదు. పదవి లేని నేత ఎంత పాపులర్ అయినా పనులు జరగవు. అందుకే వెనక్కు తగ్గుతున్నారు. వారినే బీజేపీలోకి మళ్లించాలని వైసీపీ ప్లాన్. బీజేపీ కూడా వలసదారుల కోసం తలుపులు తెరిచే ఉంది. నయానో భయానో వారందరినీ పార్టీలోకి లాగాలని పథక రచన సాగుతోంది. ఒకవేళ బాబుగారు ఈ ప్రణాళికకి అడ్డుపడితే ఆయన మీదున్న ఓటుకు నోటు లాంటి పాత కేసులను బయటకు లాగి సైలెంట్ చేయాలని అనుకుంటున్నారట. ఒకవేళ ఇదే నిజమైతే టీడీపీకి మరింత గడ్డుకాలం దాపురించినట్టే.