వైఎస్ వివేకాని ఎవరు చంపారో అందరికీ తెలుసా.?

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని ఎవరు చంపారు.? దాదాపు రెండున్నరేళ్ళవుతోంది ఆయన్ని అత్యంత కిరాతకంగా దుండగులు చంపేసి. అలాంటప్పుడు, ఇప్పటిదాకా దోషులెవరో తేలకపోవడమేంటి.? ఈ విషయమై తాజాగా ఈ కేసులో నిందితుడు లేదా అనుమానితుడిగా భావిస్తున్న సునీల్ యాదవ్ కుటుంబ సభ్యులు చేస్తున్న వ్యాఖ్యలు కొత్త అనుమానాలకు తెరలేపుతున్నాయి. ‘వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సహా, పులివెందులలో అందరికీ వైఎస్ వివేకాని ఎవరు చంపారో తెలుసు..’ అంటూ సునీల్ యాదవ్ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇటీవలే సునీల్ యాదవ్‌ని సీబీఐ అరెస్టు చేసింది.. అదీ గోవాలో. ఆ తర్వాత ఈ కేసులో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. హత్యకు ఉపయోగించిన ఆయుధాల కోసం అన్వేషణ జరిగింది. ఓ చెరువు ప్రాంతంలో అన్వేషించిన సీబీఐ, అక్కడ ఆయుధాలు దొరక్కపోవడంతో, గాలింపు చర్యల్ని నిలిపేసింది.

మరోపక్క, తాజాగా సీబీఐ కొన్ని చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించి, కొన్ని ఆయుధాల్ని స్వాధీనం చేసుకుంది. అవి వ్యవసాయ పనిముట్లుగా చెబుతున్నా, వాటినే హత్యకు వినియోగించి వుంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతలోనే, సునీల్ యాదవ్ సోదరుడు కిరణ్ యాదవ్, తాము బీసీలం కాబట్టే, తాము యాదవులం కాబట్టే సీబీఐ తమను వేధిస్తోందంటూ వింత వాదనను తెరపైకి తెచ్చారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎర్ర గంగిరెడ్డిని సీబీఐ తాజాగా అదుపులోకి తీసుకుందంటూ వార్తలొచ్చాయి. అయితే, సీబీఐ మాత్రం.. జరుగుతున్న విచారణకు సంబంధించి అన్ని విషయాల్నీ అత్యంత గోప్యంగా వుంచుతోంది. ‘మేం గోవాలో వున్నామని, సిమ్ కార్డు ద్వారా ట్రేస్ చేయగలిగిన సీబీఐ.. వైఎస్ వివేకాని ఎవరు చంపారో అందరికీ తెలిసినా, పెద్ద మనుషుల్ని అరెస్ట్ చేయడంలేదు..’ అని కిరణ్ యాదవ్ ఆరోపించడం కొసమెరుపు.