తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టనున్న షర్మిల, ఈ క్రమంలోనే నిరుద్యోగుల సమస్యలపై పోరాటమంటూ నిరాహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొంత గలాటా చోటు చేసుకుంది. షర్మిల దీక్షను పోలీసులు భగ్నం చేశారు. దాంతో, ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ప్రభుత్వాలు, రాజకీయ పార్టీల, నాయకుల, ప్రజల ప్రజాస్వామిక హక్కుల్ని కాపాడాలనీ, వాటిని విచ్ఛిన్నం చేయకూడదనీ వైఎస్ విజయమ్మ నినదించారు. ఇంతవరకూ బాగానే వుంది. నిజానికి, విజయమ్మ చెప్పినదాంట్లో తప్పేమీ లేదు. కానీ, ఇదంతా కేవలం తెలంగాణకు మాత్రమే చెల్లుతుందా.? ఆంధ్రపదేశ్ రాష్ట్రానికి ఇది వర్తించదా.? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న. వైఎస్ విజయమ్మ, గతలో ఎమ్మెల్యేగా పనిచేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలిగా కూడా వున్నారు ప్రస్తుతం.
ఆ లెక్కన, ఆమె తొలుత స్పందించాల్సింది అమరావతిలో మహిళా రైతులు చేస్తున్న ఉద్యమం గురించి. ఎప్పుడైతే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి అయ్యారో.. ఆ తర్వాత ఆమె రాజకీయాల గురించి మాట్లాడటం మానేశారు. మళ్ళీ ఇప్పుడు, తన కుమార్తె షర్మిల కోసం రాజకీయాలు మాట్లాడుతున్నారు. కేవలం టైమ్ పాస్ రాజకీయాలు చేస్తామేంటే ఎలా.? పైగా, ఒకరికి ఒక నీతి.. ఇంకొకరికి ఇంకో నీతి.. అన్నట్లు వ్యవహరిస్తే ఎలా.? అన్న ప్రశ్న సూటిగా, వైఎస్ విజయా రాజశేఖర్ రెడ్డికి తగులుతోంది. అమరావతి కోసం దాదాపు 500 రోజులుగా మహిళా రైతులు ఆందోళనలు చేస్తున్నారు. వారిపై లాఠీలు విరుగుతున్నాయి.. అమరావతి కోసం భూములిచ్చిన మహిళా రైతులు రక్తం చిందించాల్సి వస్తోంది. వాళ్ళు కూడా షర్మిల లాంటి మహిళలే. షర్మిలకు ఒక న్యాయం.. అమరావతి మహిళా రైతులకు ఇంకో న్యాయం అంటే ఎలా.? అమరావతి రైతుల తరఫున వకాల్తా పుచ్చుకోవాల్సిన అవసరం లేదు. అది ఫేక్ ఉద్యమమా.? రియల్ ఉద్యమమా.? అన్నది వేరే చర్చ. ఏపీలో సాటి మహిళ రక్తం చిందించినా, పట్టించుకోని విజయమ్మ.. తెలంగాణలో తన కుమార్తెకు అన్యాయం జరిగిపోయిందని గగ్గోలు పెట్టడం అస్సలు సబబు కాదు. ఎలా చూసినా షర్మిల తెలంగాణలో చేస్తున్న రాజకీయం, పరోక్షంగా ఆంధ్రపదేశ్ రాష్ట్ర రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపనుందన్నది నిర్వివాదాంశం.