షర్మిల ట్వీట్లు.. కేసీయార్‌కి కాదు, వైఎస్ జగన్‌కి పోట్లు.!

తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ స్థాపించిన వైఎస్ షర్మిల, తెలంగాణ ప్రభుత్వాన్ని సోషల్ మీడియా వేదికగానూ, ప్రజల్లోకి వెళ్ళి కూడా తూర్పారబడుతున్న విషయం విదితమే. ప్రధానంగా షర్మిల సోషల్ మీడియాలో వేస్తున్న ట్వీట్లు, తెలంగాణ ప్రభుత్వానికి కాకుండా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్ సర్కారుపైకి ఈటెల్లా దూసుకెళుతున్నాయి. తాజాగా, చేనేత దినోత్సవం నేపథ్యంలో షర్మిల ట్వీటేశారు. అందులో స్పష్టంగా కేసీయార్ సర్కారు మీద ఆమె విమర్శలు చేశారు. కానీ, వాటిని వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అన్వయిస్తున్నారు చాలామంది నెటిజన్లు. ఎన్నికల ప్రచారంలోనో, ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే, చేనేతల మీద ప్రభుత్వాలు ప్రేమ కురిపిస్తుంటాయన్నది షర్మిల ఆరోపణ.

అదీ నిజమే. ఏ రాజకీయ పార్టీ అయినా చేసేది అదే. వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల మాత్రం, ఈ రోజు రాజకీయ నాయకురాలిగా అవతారమెత్తారు గనుక, చేనేత గురించి మాట్లాడుతున్నారు.. లేకపోతే, ఏనాడైనా ఆమె చేనేతల గురించి మాట్లాడారా.? ఈ ప్రశ్న సహజంగానే పుట్టుకొస్తుంది మరి. నిజానికి, తెలంగాణలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యమవకుండా షర్మిల తెలంగాణ విభాగాన్ని టేకప్ చేసి వుంటే, ఇప్పుడీ దుస్థితి వచ్చేది కాదు. ఎప్పుడైతే ఆమె వేరు కుంపటి పెట్టారో, ఆమె చేస్తున్న ప్రతి విమర్శా తొలుత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికే తగులుతోంది. అంతలా షర్మిల విమర్శల్ని వైఎస్ జగన్ ప్రత్యర్థులు వాడేసుకుంటున్నారు. ‘నేను ఎవరో వదిలిన బాణాన్ని కాదు..’ అని పదే పదే షర్మిల చెబుతున్నారుగానీ, జగన్ కనుసన్నల్లో దూసుకొచ్చిన షర్మిల అనే బాణం, అనుకోకుండా వైఎస్ జగన్ మీదకే దాడికి యత్నిస్తోంది.. అదీ పరోక్షంగా.