కేసీఆర్‌ను టార్గెట్ చేసిన వైఎస్ షర్మిల.. మరోసారి సంచలన వ్యాఖ్యలు !

తెలంగాణ రాజకీయాల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు వైఎస్ షర్మిల దూకుడు పెంచారు. కొత్త పార్టీ ఏర్పాటు దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. వైఎస్ఆర్ అభిమానులతో వరుసగా ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తూ హాట్ టాపిక్‌గా మారారు. ఈక్రమంలోనే సీఎం కేసీఆర్‌ను మరోసారి టార్గెట్ చేశారు వైఎస్ షర్మిల. బుధవారం ఉమ్మడి మెదక్ జిల్లా వైఎస్సార్ అభిమానులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

YS Shramila: సీఎం కేసీఆర్‌ను టార్గెట్ చేసిన వైఎస్ షర్మిల.. మరోసారి సంచలన వ్యాఖ్యలు

సీఎం కేసీఆర్ జిల్లాగా చెప్పుకునే మెదక్‌లో 20 కరువు మండలాలు ఉండడం బాధాకరమని షర్మిల విమర్శించారు. పటాన్ చెరు ప్రాంతం కాలుష్య కోరల్లో చిక్కుకుందని పేర్కొన్నారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టుకు భూములిచ్చిన రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని.. వారికి ఇంకా న్యాయం జరగలేదని సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. అందుకే వారు కొంతకాలంగా ఆందోళనలు చేస్తున్నారని మండిపడ్డారు. దళితుల భూములను లాక్కుంటున్నారని విరుచుకుపడ్డారు.

టీఆర్ఎస్ పాలనలో నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్న ఆమె.. యువతకు అన్యాయం చేస్తున్నారని అన్నారు. ఇక మెదక్ జిల్లా… పాటకు ప్రాణం, విప్లవానికి ఊపిరిపోసిన గద్దర్ పుట్టిన గడ్డ అని కొనియాడారు వైఎస్ షర్మిల. ప్రాణహిత-చేవెళ్ల పథకం ద్వారా మెదక్ జిల్లాకు 5.19 లక్షల ఎకరాల భూమికి సాగునీరు అందించాలని వైఎస్ రాజశేఖర్ రెడ్డి భావించారని..దానిని రీడిజైన్ చేసిన నాయకులు, ఇప్పటి వరకు ఏం చేశారో ఎవరికీ తెలియదని విమర్శలు గుప్పించారు.