వైఎస్ జగన్ రాజకీయ చతురత ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పాల్సిన ఆపని లేదు. 2019 ఎన్నికల్లో ఆయన చాణక్యం ఏంటో బయటపడింది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని కారణాన్ని ఆసరాగా చేసుకుని జగన్ ఏకంగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. 2014లో ప్రతిపక్షంలో ఉండగా 23 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడితే ఎదురైన సంక్షోభం నుండి ఆయన పార్టీని బయటపడేసిన వైనం చాలా గొప్పది. వేరేవారు ఎవరైనా అయితే ఆ పరిస్థితుల్లో మరింత కుంగిపోయేవారే. కానీ జగన్ పడిలేచిన కెరటంలా ముఖ్యమంత్రి పదవిని సొంతం చేసుకున్నారు. జనాలకు సైతం కనిపించని పొలిటికల్ వ్యాక్యూమ్ ను జగన్ పట్టుకోగలిగారు. ఇప్పుడు అదే చాకచక్యాన్ని తెలంగాణలో చూపించాలని అనుకుంటున్నారట ఆయన. ఈమేరకు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం నడుస్తోంది.
కుటుంబంలో జగన్ తర్వాత షర్మిలకు రాజకీయాలంటే చాలా ఆసక్తి. అన్న జైలులో ఉండగా పార్టీకి పెద్దదిక్కై నడిపింది ఆమే. పాదయాత్రలు, రోడ్ షోలు అంటూ జనానికి దగ్గరయ్యారు. తన అన్నాను కుట్రపూరితంగా జైలుకు పంపారని జనానికి తెలియజెప్పగలిగారు. కాంగ్రెస్, టీడీపీలు ప్రధాన ప్రత్యర్థులుగా ఉండగా షర్మిల ఒక్కరే వైసీపీ తరపున వారిని ఢీకొట్టారు. ఆమే లేకుంటే రాజకీయంగా జగన్ వెనుకబడేవారే. అందుకే జగన్ ఇప్పుడు ఆమెను రాజకీయంగా మరింత ముందుకు తీసుకెళ్లడానికి సిద్ధమయ్యారని వార్తలొస్తున్నాయి. అయితే షర్మిలకు ఏపీలో కాకుండా తెలంగాణలో రాజకీయ వేదికను సిద్ధం చేస్తున్నారు ఆయన. దుబ్బాక ఉప ఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లలో బీజేపీ బలపడిన వైనాన్ని చూస్తే అక్కడి జనం ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారని స్పష్టమైంది. దాన్నే బీజేపీ ఒడిసిపట్టగలిగింది. జగన్ సైతం ఆ రాజకీయ శున్యతనే టార్గెట్ చేశారట.
ఉమ్మడి రాష్ట్రం ముఖ్యమంత్రిగా దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డిగారికి ఎంతో గొప్ప పేరుంది. ఒంటి చేత్తో రెండుసార్లు పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు ఆయన. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఒక్క తెలుగుదేశం మినహా మిగతా స్థానిక రాజకీయ పార్టీలు ఏవీ కూడ మనుగడ సాధించలేకపోయాయి. తెరాస, ప్రజారాజ్యం, కమ్యూనిస్టు పార్టీలు ఎక్కడో పాతాళస్థాయిలో ఉండేవి. ఆయన మరణం, రాష్ట్రం విడిపోవడంతో తెలంగాణలో తెరాస నిలదొక్కుకుంది. వైఎస్ సారథ్యం వహించిన కాంగ్రెస్ పార్టీ అయితే అటు ఏపీ, ఇటు తెలంగాణ రెండింటిలోనూ అద్వానపు స్థితికి చేరుకుంది. నిజం చెప్పాలంటే వైఎస్ఆర్ ఛరీష్మాను ఏపీలో జగన్ బెనిఫిట్ చేసుకుంటే తెలంగాణలో కాంగ్రెస్ చేసుకుని ఉండాలి. కానీ చేసుకోలేకపోయింది. వైఎస్, కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి. అందుకే తెలంగాణ జిల్లాల్లో భారీ సంఖ్యలో వైఎస్ అభిమానులున్నా వారెవరూ కాంగ్రెస్ వైపు చూడట్లేదు.
వేరే ప్రత్యామ్నాయం లేక తెరాస, బీజేపీలకు ఓట్లు వేస్తున్నారు. ఇప్పుడు ఆ ప్రత్యామ్నాయాన్ని షర్మిల రూపంలో దింపాలనేది జగన్ యోచన అని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. షర్మిల ద్వారా అక్కడో పార్టీ పెట్టించి వైఎస్ఆర్ అభిమానులను ఒక తాటి మీదకు తీసుకొచ్చి తెరాసకు ప్రత్యామ్నాయం కావాలని భావిస్తున్నారట. ఒకవేళ ఇదే నిజమైతే షర్మిల నుండి తెరాసకు ఇప్పటికిప్పుడు ఎలాంటి ఇబ్బందీ ఉండదు. కానీ ఇప్పుడిప్పుడే బలపడుతున్న బీజేపీకే తగని నష్టం వాటిల్లుతుంది. వైఎస్ఆర్ ను ఇప్పటికీ అమితంగా ఇష్టపడే అభిమానులు తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో మెండుగా ఉన్నారు. వారందరూ గనుక షర్మిలకు సపోర్ట్ చేసినా, హైదరాబాద్ ప్రాంతంలోని సెటిలర్లు, జగన్ అభిమానులు షర్మిలకు జైకొట్టినా ఇప్పుడిపుడే పెరుగుతున్న బీజేపీ ఓటుబ్యాంకుకు గండిపడ్డట్టే అవుతుంది. కాబట్టి తెలంగాణలోకి షర్మిల ఎంట్రీ బీజేపీకి తీవ్రమైన నష్టాన్నే కలిగిస్తుందని ఒప్పుకోక తప్పదు.