YS Sharmila : వైఎస్ జగన్‌ని టార్గెట్ చేసిన షర్మిల, నిజమేనా.?

YS Sharmila : ‘ఎవరూ శాశ్వతంగా అధికారంలో వుండరు. అలా వుండిపోతామనుకోవడం మూర్ఖత్వం..’ అంటూ వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపుతున్నాయి. తెలంగాణలోని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆమె నేరుగా టార్గెట్ చేస్తున్నా, పరోక్షంగా ఆమె వ్యాఖ్యలు, విమర్శలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కూడా గట్టిగానే తగులుతున్నాయి.

‘వైఎస్ షర్మిల మా కుటుంబ సభ్యురాలే. ఆమె మా పార్టీ మీద ఎందుకు విమర్శలు చేస్తారు.?’ అంటూ వైసీపీ నేతలు పలువురు బుకాయిస్తున్నా, వైఎస్ షర్మిల వ్యూహం అందరికీ అర్థమవుతోంది. ఓ విషయాన్ని జనరలైజ్ చేసి చెప్పడం రాజకీయ నాయకులకు వెన్నతోపెట్టిన విద్య. దాన్ని సందర్భానుసారం వాడటం కొందరికి మాత్రమే తెలిసిన ప్రత్యేకమైన విద్య. ఆ విద్యలో షర్మిల ఆరితేరినట్టే కనిపిస్తున్నారు.

అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో షర్మిలకు విభేదాలు వుండడం వింతేమీ కాదు. కుటుంబమన్నాక అభిప్రాయ బేధాలు, విభేదాలు మామూలే. పైగా, ఇద్దరూ వేర్వేరు పార్టీలకు నాయకత్వం వహిస్తున్నారాయె. రాజకీయం అంటే, బౌండరీస్ గీసుకుని చేసేది కాదు. ఒక్కోసారి బౌండరీ అవతల కూడా చూడాల్సి వస్తుంది.

వైఎస్ షర్మిల కూడా, తనకు తెలంగాణలో వర్కవుట్ అవదనుకుంటే, ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై చూస్తారు. ఇందులో వింతేమీ లేదు. పైగా, షర్మిల గనుక అలా చూస్తే పదుల సంఖ్యలో వైసీపీ నేతలు, షర్మిల వెంట నడిచేందుకూ ఆస్కారం వుంది. ఆ సంగతి ఆమెకూ తెలుసు. అందుకే, ప్రస్తుతానికి ‘జనరలైజ్’ ప్రకటనలు చేస్తూ, ‘హోల్డ్’ చేస్తున్నారు.

మరి, షర్మిల వ్యూహాత్మక ప్రకటనలపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆలోచనలు ఎలా వున్నాయో.!