తెలంగాణ రాజకీయ యవనికపైకి మరో కొత్తపార్టీ రాబోతోంది. రాజకీయాల్లోకి వస్తున్నట్టు ఇది వరకే ప్రకటించిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి వైఎస్ షర్మిల ఉమ్మడి జిల్లాల వారీగా వైఎస్ అభిమానులతో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. సమస్యలు తెలుసుకుంటున్నారు. ఈ ఆత్మీయ సమావేశాలు ముగిసిన తర్వాత ఏప్రిల్ 9న పార్టీ ప్రకటిస్తారని ఆమె అనుచరుడు తూడి దేవేందర్‌రెడ్డి తెలిపారు.
పార్టీ విధివిధానాలు, భవిష్యత్ కార్యాచరణ వంటి వాటిని కూడా ఆ రోజు వెల్లడిస్తారని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో నిన్న విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. షర్మిల నేడు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా అభిమానులతో సమావేశం అవుతారు. ఈ సందర్భంగా అక్కడి సమస్యలు, తాగు, సాగునీరు వంటి సమస్యల గురించి అడిగి తెలుసుకుంటారు. వారి నుంచి అభిప్రాయాలు సేకరిస్తారు. వచ్చే నెల 9న ఖమ్మంలో చివరి ఆత్మీయ సమావేశం ఉంటుంది. అదే రోజున పార్టీని ప్రకటించే అవకాశం ఉందని దేవేందర్‌రెడ్డి తెలిపారు.
2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మే 14న సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. దీంతో 2021 మే 14న పార్టీ పెడతారని ప్రచారం జరిగింది. లేకపోతే జూలై 8న వైఎస్ఆర్ జయంతి రోజున కొత్త పార్టీని ప్రకటిస్తారని ప్రచారం జరిగింది. తాజాగా మరోసారి వైఎస్ షర్మిల కొత్త పార్టీ ప్రకటన తేదీ బయటకు వచ్చింది. ఏప్రిల్ 9వ తేదీని ముహూర్తంగా ఫిక్స్ చేయడం వెనుక కూడా కారణం ఉంది. 2003లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన 1500 కిలోమీటర్ల పాదయాత్ర ఏప్రిల్ 9 న ముగిసింది. 60 రోజుల పాటు ఆయన పాదయాత్ర చేశారు. వైఎస్ షర్మిల కొత్తగా పెట్టబోయే పార్టీకి రెండు మూడు పేర్లు పరిశీలనలో ఉన్నట్టు చెబుతున్నాయి. వైఎస్ఆర్ టీపీ, వైఎస్ఆర్ పీటీతో పాటు రాజన్న రాజ్యం అనే పేరును కూడా పరిశీలిస్తున్నారు.