ఏపీలో పంచాయతీ ఎన్నికలు వాయిదా వేయాలని జగన్ సర్కార్ చేయని ప్రయత్నం లేదు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు నిర్వహించాలని చూసిన రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్ కు కులం ఆపాదించి నీలాపనిందలు మోపడం మొదలు…ఎన్నికలకు సహకరించబోమంటూ ప్రభుత్వ ఉద్యోగులను రెచ్చగొట్టడం వరకు….ఎన్నికలు ఆపేందుకు వైసీపీ నేతలు చేయని ప్రయత్నాలు లేవు. అయితే , సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో మరో దారి లేకుండాపోయింది. దీనితో ఎన్నికల నిర్వహణ పై దృష్టి పెట్టింది.
దీంతో, ఎన్నికలలో అలజడులు రేపేందుకు అచ్చెన్నాయుడు అరెస్టు, పట్టాభి వంటి టీడీపీ నేతలపై దాడులతో వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. మరోవైపు, ఎన్నికల్లో గెలుపు తమదేనని, చాలాచోట్ల ఏకగ్రీవాలే అవుతాయని, వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. నిజంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపుపై వైసీపీ నేతలకు ధీమా ఉంటే….బలవంతపు ఏకగ్రీవాలకు ఎడతెగని ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నారన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పేదోడికి స్వర్ణయుగం ఇచ్చామని చెప్పుకుంటున్న జగన్ కు ఆ జనం అడగకపోయినా ఓట్లేస్తారు కదా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. జగన్ కు జనామోదం ఉందనుకున్నపుడు నామినేషన్లు వేయాలని ప్రతిపక్షాలకే పిలుపివ్వాలి. ప్రజాతీర్పుతో తన బలం నిరూపించుకొని చంద్రబాబు పనయిపోయిందని నిరూపించగలగాలి.
అయితే, ప్రస్తుతం ఏపీలో ఇలా జరగడం లేదు. స్థానిక సంస్థల ఎన్నికలంటేనే వైసీపీ నేతలు భయపడుతున్నారన్న టాక్ వస్తోంది. జగన్ గురించి జనాలకు తెలిసిపోయిందని, ప్రజల అంచనాలను అందుకోవడంలో జగన్ విఫలమయ్యారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తండ్రి ఎంత దోచినా జనాల పథకాల్లో లెక్కలు వేయలేదని….కులం, పార్టీ చూడకుండా అర్హులందరికీ పథకాలు ఇచ్చారని టాక్ ఉంది. కానీ, ఎన్నికలకు ముందు కులం చూడం…మతం చూడం….పార్టీ చూడం అంటూ డప్పు కొట్టిన జగన్…గెలిచిన తర్వాత రెడ్డి కులం, క్రిస్టియన్ మతం, వైసీపీ పార్టీ అయితేనే పథకాలు ఇస్తున్నాడని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.