ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఈ విషయం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులతోనే సుస్పష్టమవుతోంది. ప్రతి నెలా అప్పుల కోసం రాష్ట్ర ప్రభుత్వం పరుగులు పెట్టాల్సి వస్తోంది. అప్పులు చేస్తే తప్ప రాష్ట్రం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేని పరిస్థితి.
ఉద్యోగులకు వేతనాల దగ్గర్నుంచి, సంక్షేమ పథకాల వరకూ.. దేనికైనా అప్పు చేయాల్సిందే. మామూలుగా అయితే, ఇలాంటి పరిస్థితుల్లో సంక్షేమ పథకాలకు కోత పడుతుంటుంది. కానీ, సంక్షోభంలోనూ సంక్షేమం మర్చిపోవడంలేదు వైఎస్ జగన్ సర్కార్.
తాజాగా జగనన్న విద్యా దీవెన పథకం కింద 686 కోట్ల రూపాయల్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విడుదల చేశారు. పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదివేందుకు ఎలాంటి ఇబ్బందులూ వుండకూడదన్న కోణంలో, క్రమం తప్పకుండా విద్యా దీవెన పథకాన్ని అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు.
విపక్షాల విమర్శలెలా వున్నాగానీ, అమ్మ ఒడి దగ్గర్నుంచి విద్యా దీవెన వరకూ.. ఆ మాటకొస్తే, ఏ సంక్షేమ పథకం విషయంలోనూ వైఎస్ జగన్ ప్రభుత్వం రాజీ పడటంలేదు. అసలు రాష్ట్రంలో అభివృద్ధి అనేదే లేదన్న విమర్శల్ని అస్సలు పట్టించుకోకుండా వైఎస్ జగన్ సర్కార్ తన పని తాను చేసుకుపోతోంది.
అయితే, ఆయా సంక్షేమ పథకాలకు వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లే, అభివృద్ధి కార్యక్రమాల కోసం కూడా ఎంతో కొంత ఖర్చు రాష్ట్ర ప్రభుత్వం విధిగా చేయాల్సి వుందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. మరీ ముఖ్యంగా రాష్ట్రంలో అధ్వాన్నంగా తయారైన రోడ్లను బాగు చేయాలన్నది మెజార్టీ ప్రజల డిమాండ్ కూడా.
కాగా, సంక్షేమ పథకాల్ని తాము ఓటు బ్యాంకు పథకాలుగా చూడటంలేదనీ, ఆ పథకాల ద్వారా లబ్ది పొందినవారు ఆర్థికంగా అభివృద్ధి చెందితే.. అది రాష్ట్ర అభివృద్ధికి కారణమవుతుందని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు.