టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా వున్న సమయంలో అసెంబ్లీ సాక్షిగా అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద ఏ స్థాయిలో దూషణలకు దిగారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మూకుమ్మడిగా టీడీపీ అప్పట్లో చట్ట సభల సాక్షిగా చేసిన మాటల దాడి ఎవరూ మర్చిపోలేరు.
మరి, దానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సహా వైసీపీ నేతలు బదులు తీర్చుకోకుండా వుంటారా.? తీర్చుకుంటున్నారు.. రెండున్నరేళ్ళుగా అదే తంతు నడుస్తోంది చట్ట సభల్లో. అంతకు మించిన స్థాయిలో దూషణలు నడుస్తున్నాయి.
ఇలా, ఈ వ్యవహారాల కారణంగానే చట్ట సభలంటే ప్రజల్లో గౌరవం తగ్గిపోతోంది. తమ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడబోదంటూనే, రివెంజ్ పాలిటిక్స్ చేసేస్తోంది వైసీపీ. తాజాగా, కుప్పం మునిసిపాలిటీ ఎన్నికల వ్యవహారంపై అసెంబ్లీ, శాసన మండలి సమావేశాల సందర్భంగా జరిగిన బీఏసీ సమావేశంలో, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. చంద్రబాబు మీద సెటైర్లేశారట.. టీడీపీ నేత అచ్చెన్నాయుడు వద్ద.
సహజంగానే అచ్చెన్నాయుడికి మైండ్ బ్లాంక్ అయిపోయి వుండాలి. అయితే, ఆయనా రివర్స్ ఎటాక్ చేశారంటూ మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి. ‘మీరెలా గెలిచారో మీ అంతరాత్మకే తెలుసు.. గెలుపోటములు సహజం. మాకేమీ ఇబ్బంది లేదు..’ అని అన్నారట అచ్చెన్న.
సరే, ఈ సెటైర్లు.. కౌంటర్ ఎటాక్‌ల వల్ల ప్రజలకేంటి ప్రయోజనం.? చట్ట సభల కార్యకలాపాలంటే.. అవి రాజకీయ పార్టీలు, రాజకీయాలు మాట్లాడుకోవడానికి కాదు.. సెటైర్లేసుకోవడానికి అసలే కాదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో కొత్త రాజకీయాలు, రాష్ట్ర భవిష్యత్తు కోసం పని చేస్తాయని ఆశించారు చాలామంది.
వైఎస్ జగన్, విపక్షాల ట్రాప్‌లో పడకుండా రాష్ట్రానికి మెరుగైన పాలన అందించగలగాలి. ఎటూ వైసీపీ నేతలు, విపక్షాలపై విరుచుకుపడుతున్నారు గనుక, ముఖ్యమంత్రి తన హుందాతనాన్ని కోల్పోకుండా వుంటే మంచిది.