కాస్త ఆలస్యమైనా తప్పు దిద్దుకున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఆంద్రప్రదేశ్ రాజధాని, రాజధానుల విషయంలో వెల్లువెత్తుతున్న ప్రజా చైతన్యం గురించి ఖచ్చితమైన సమాచారం అందుకున్నారో ఏమోగానీ, మూడు రాజధానుల ఆలోచనను విరమించుకుంది వైఎస్ జగన్ ప్రభుత్వం.
మరింత మెరుగైన ఆలోచనలతో, ఇంకా మెరుగైన వికేంద్రీకరణ బిల్లతో మళ్ళీ వస్తాం.. అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పినప్పటికీ, ఈసారి మూడు రాజధానుల ప్రతిపాదన వుండకపోవచ్చు. ఎందుకంటే, మూడు రాజధానులనే కాన్సెప్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు, ఏ రాష్ట్రానికీ, ఏ దేశానికీ వర్కవుట్ కాదు.
అభివృద్ధి అంతా ఒకే చోట వుండాలనే ఆలోచన సరికాదు. అలాగని, రాజధానిని మూడు ప్రాంతాల్లో పెడతామనడమూ సబబు కాదు. ఇదే విషయమై వైఎస్ జగన్ ప్రభుత్వం కాస్త లేటుగా తెలుసుకుంది. ఒకే ఒక్క రాజధాని.. అభివృద్ధి మాత్రం అంతటా.. అనే నినాదాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వం భుజానికెత్తుకుంటే.. దాన్నెవరూ కాదనరు.
బహుశా అదే ఆలోచనతో సరైన సమయంలో వైఎస్ జగన్, మూడు రాజధానుల చట్టాన్ని వెనక్కి తీసుకున్నారని అనుకోవచ్చు. ఇక, ఇప్పుడు టీడీపీ పరిస్థితేంటి.? టైమ్ చూసి వైఎస్ జగన్, తెలుగుదేశం పార్టీని కోలుకోలేని దెబ్బ కొట్టారు. అమరావతి ఉద్యమం చల్లారడం ఖాయం. అదొక్కటే ఇప్పటిదాకా టీడీపీకి ఊపిరి పోస్తూ వచ్చింది.
ఇకపై చంద్రబాబు ఏం చేసినా, ప్రజల్లో విశ్వసనీయత పెరిగే అవకాశమే వుండదు. రాజధాని ప్రాంతంలోనూ వైఎస్ జగన్ పట్ల వ్యతిరేకత క్రమంగా తగ్గుతుంది. సో, రాష్ట్రంలో ఇకపై ఎలాంటి అలజడీ వుండకపోవచ్చు. రానున్న రెండున్నరేళ్ళలో అమరావతిలో వైఎస్ జగన్ తన మార్కు చూపగలిగితే, ఆ తర్వాత విశాఖ అలాగే కర్నూలు అభివృద్ధి పట్ల ప్రజల్లోనూ నమ్మకం పెరుగుతంది. 2024 ఎన్నికల నాటికి వైసీపీ మరింతగా శక్తిని పుంజుకుంటుంది.