కోట్ల ఖరీదైన ‘సలహా’.! అసలెందుకిదంతా.?

‘ఉచిత సలహా’ అని సరదాగా అంటుంటాం. కానీ, ఇక్కడ ‘సలహా’ ఉచితం కాదు. చాలా ఖరీదైనది. ఎంత ఖరీదైనదంటే, కోట్ల రూపాయల విలువైన సలహా అది. అప్పట్లో చంద్రబాబు హయాంలోనూ, ఇప్పుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలోనూ రాష్ట్ర ప్రజల నెత్తిన ‘సలహా’ ఓ బండలా పడుతూనే వుంది. మూలిగే నక్క మీద తాటికాయ పడటం.. అంటారు కదా.! అచ్చం అదే పరిస్థితి.

అసలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన కారణంగా ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొంటోంటే, ప్రభుత్వాల పబ్లిసిటీ స్టంట్ల కోసమే కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోంది. అది చాలదన్నట్టు, సలహాదారుల పేరుతో ప్రభుత్వ ఖజానాకి తూట్లు పొడిచే ప్రక్రియ ఒకటి.

తాజాగా ఉన్నత న్యాయస్థానం ఈ సలహాదారుల విషయమై వైసీపీ సర్కారుకి షాకిచ్చింది. అంతే కాదు, సలహాదారుల అవసరమేంటి.? అని కూడా ప్రశ్నించింది. దాంతో, ఈ విషయమై ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడ చూసినా ఈ సలహాదారుల గురించిన చర్చే జరుగుతోంది.

జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన.. ఇవన్నీ వేలల్లో మాత్రమే లబ్దిదారులకు అందుతున్న సంక్షేమ పథకాలు. సలహాదారులకు మాత్రం లక్షల్లో ‘జగనన్న కానుకలు’ అందుతున్నాయ్.! రకరకాల సలహాదారులున్నారు వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో. అంతకు ముందు.. అంటే చంద్రబాబు హయాంలోనూ సలహాదారుల కోసం బాగానే ఖర్చు చేశారు.

అయితే, వైఎస్ జగన్ హయాంలో సలహాదారుల పరిస్థితి మరీ దారుణంగా విమర్శల పాలవుతోంది. వేతనాలు, ఆపై అదనపు సౌకర్యాలు.. వెరసి, ప్రభుత్వ ఖజానాకి భారీగానే చిల్లు పడుతోంది. అధికారంలో లేనప్పుడు, సొంత ఖర్చుతో ప్రచారం చేసుకున్నారు కదా.. అధికారంలోకి వచ్చాక ఎందుకు ప్రజా ధనంతో సంక్షేమ పథకాలకు ప్రచారం చేసుకోవాలి.? అన్నది సామాన్యుల నుంచి వస్తోన్న ప్రశ్న.

సలహాదారుల సంగతి సరే సరి.! ఈ సలహాదారుల్ని సైతం, పార్టీ తరఫున పెట్టుకుని, చెల్లింపులు చేసుకోవచ్చు కదా.? అన్న వాదన వుంది. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ప్రభుత్వమే వేతనాలు ఇస్తుంది. అలాంటప్పుడు, మళ్ళీ ఈ సలహాదారులెందుకట.?