Ys Jagan : సినిమా దోపిడీని అరికడితే తప్పేంటి.?

Ys Jagan :  సినిమా టిక్కెట్ల ధరల్ని నియంత్రిస్తే తప్పేంటి.? సామాన్యుడికి చవకైన వినోదంగా సినిమాకి పేరుంది. కానీ, ఆ సినిమా గత కొంతకాలంగా అత్యంత ఖరీదైన వ్యవహారమైపోయింది. పెద్ద హీరోల సినిమాలంటే, ఓ రెండు వారాల పాటు ఫ్లాట్ రేటు పెట్టి టిక్కెట్లు అమ్మేయడం సర్వసాధారణగా మారిన రోజుల నుంచి, సినిమా టిక్కెట్ల ధరలు సాధారణ స్థాయికి రావడమంటే చిన్న విషయం కాదు.

సినిమా అనేది సామాన్యుడికి దూరమైపోయి చాలాకాలమే అయ్యింది. అందుక్కారణాలనేకం. థియేటర్ల యాజమాన్యాల నిర్వాకం, వారి వెనకాల వుండి కథ నడిపించే డిస్ట్రిబ్యూటర్లు, కొందరు నిర్మాతలు.. వెరసి, తొలి వారం సాధారణ ప్రేక్షకుడు సినిమా థియేటర్‌కి వచ్చే పరిస్థితి లేకుండా చేశారు.

సినిమా టిక్కెట్ ధర బ్లాక్ మార్కెట్‌లో ఎలా వున్నా, థియేటర్ కౌంటర్ల వద్దనే అనూహ్యంగా పెరిగిపోవడంతో, థియేటర్లలోని కూల్ డ్రింక్స్, సమోసా ధరలు కూడా పెంచి పారేశారు. అవన్నీ సామాన్యుడికి అత్యంత భారంగా మారాయి. ‘సినిమా చూడాలనుకున్నోడు ఎంత ఖర్చయినా చేస్తాడు..’ అనే వింత వాదనను కొందరు తెరపైకి తేవడం పరిపాటిగా మారిపోయింది.

సరే, ఈ టిక్కెట్ ధరల నియంత్రణ పుణ్యమా అని పెద్ద సినిమాలకు ఇబ్బందులు.. అన్నది వేరే చర్చ. ఇక్కడ సామాన్యుడి దృష్టి కోణంలోంచి చూస్తే, సినిమా టిక్కెట్ ధరలు అందుబాటులోకి రావడం, థియేటర్లలో తినుబండారాల ధరలపై ఉక్కుపాదం మోపడం.. ఆహ్వానించదగ్గ విషయాలే.

థియేటర్లలో ఓ పాతిక టిక్కెట్లు విక్రయించేసి, మిగతావన్నీ ఆన్‌లైన్‌లో అమ్మేసినట్టు చూపించి, థియేటర్ల బయట థియేటర్ల యాజమాన్యాలే సిబ్బందిని పెట్టి మరీ బ్లాక్‌లో టిక్కెట్లు అమ్మించిన రోజులున్నాయి. ఆ పాపాలకు ప్రాయిశ్చిత్తం ఇప్పుడు జరుగుతోందనుకోవాలేమో.