దేశంలో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు క్షేత్ర స్థాయిలో పర్యటనలు నిర్వహిస్తూ, కరోనా వైరస్ ప్రభావాన్ని అంచనా వేస్తూ, తమ రాష్ట్ర ప్రజల్ని ఆదుకునేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఇలా క్షేత్ర స్థాయి పర్యటనలు ఎంతవరకు సబబు.? అన్న విషయమై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రులు రంగంలోకి దిగితే, వారికి రక్షణ కల్పించడం అనేది ఓ సమస్య. దాంతోపాటుగా, ఎక్కువమంది గుమికూడటం ద్వారా కరోనా వ్యాప్తికి ఆస్కారమిచ్చినట్లవుతుంది.
ఈ నేపథ్యంలోనే కొందరు ముఖ్యమంత్రులు చాలా చాలా అరుదుగా మాత్రమే బయటకు వస్తున్న పరిస్థితిని చూస్తున్నాం. మంత్రులు మాత్రం ఆయా రాష్ట్రాల్లో పరిస్థితుల్ని క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తున్నారు.. ఆంధ్రపదేశ్ రాష్ట్రంలోనూ ఈ పరిస్థితి కనిపిస్తోంది. ఎప్పుడైతే తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గాంధీ ఆసుపత్రిని సందర్శించారో, సహజంగానే ఆ తర్వాతి నుంచీ ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద ఒత్తిడి పెరిగింది.. క్షేత్రస్థాయి పర్యటనల విషయమై. ఏపీ సీఎం వైఎస్ జగన్, తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక ప్రచారానికి కూడా వెళ్ళలేదు.. కరోనా వ్యాప్తికి కారణం కాకూడదనే. వైఎస్ జగన్ వ్యాక్సిన్ తీసుకున్నారు.. ఆ విషయం అందరికీ తెలిసిందే. అయినాగానీ, ఆయన వ్యూహాత్మకంగా సంయమనం పాటిస్తున్నారు క్షేత్రస్థాయి పర్యటనల విషయంలో.
అయితే, ఎప్పటికప్పుడు కరోనా వైరస్ ప్రభావంపై సమీక్షలు నిర్వహిస్తూ, కీలక నిర్ణయాలు తీసుకుంటూనే వున్నారు. ‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బయటకు రావడంలేదు.. యువ ముఖ్యమంత్రి అయి కూడా ఇదేం పద్ధతి.? వివిధ రాష్ట్రాల్లో 60 ఏళ్ళు ఆ పైబడిన వయసున్న ముఖ్యమంత్రులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజలకు భరోసా ఇస్తున్నారు..’ అంటూ వివిధ రాజకీయ పార్టీల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, వైఎస్ జగన్.. జనంలోకి వెళితే, జనాన్ని అదుపు చేయడం కష్టమైన పని.. అన్నది వైసీపీ వాదన.