వైఎస్ జగన్ పైకి ఏమీ మాట్లాడకపోయినా లోపల చేయవలసిన పనులు చేస్తూనే ఉన్నారు. ప్రతి జిల్లా మీదా గట్టి దృష్టి పెట్టి టీడీపీ అసంతృప్త నేతలకు వల వేస్తున్నారు. అది కూడా సాదా లీడర్లకు కాదు ఆయా జిల్లాలో దశాబ్దాల తరబడి రాజకీయాల్లో చక్రం తిప్పిన పెద్ద కుటుంబాలకు కావడం విశేషం. వైఎస్ జగన్ ప్రజెంట్ టార్గెట్ చేసిన కుటుంబాల్లో గుంటూరుకు చెందిన రాయపాటి ఫ్యామిలీ, చిత్తూరుకు చెందిన డీకే కుటుంబం ఉన్నాయట. గుంటూరు జిల్లా రాజకీయాల్లో రాయపాటి సాంబశివరావుది ప్రత్యేక స్థానం. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జిల్లా రాజకీయాల్లో ఆయన మాటే శాసనంగా నడిచింది. నేరుగా సోనియా గాంధీతో తన టికెట్ గురించి మాట్లాడుకునే స్థాయి ఆయనది.
2014 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరిన ఆయన నరసారావుపేట నుండి పోటీచేసి గెలిచారు. కానీ గత ఎన్నికల్లో మాత్రం ఓడిపోయారు. అప్పటి నుండి ఆయన కుటుంబాన్ని చంద్రబాబు నాయుడు పెద్దగా పట్టించుకోవడంలేదు. గుంటూరు జిల్లా ఇంఛార్జ్ నియామకాల్లో ఆయన మాటే చెల్లుబడి కాలేదు. సాంబశివరావు తన వారసుడు రంగారావును రాజకీయాల్లోకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు. అయితే టీడీపీ పట్టించుకోవట్లేదు. అదే ఆయనలో తీవ్ర అసహనాన్ని కలిగించింది. ఈ అసహనాన్నే గుర్తించిన జగన్ వైసీపీలోకి రమ్మని ఆయనకు సంకేతాలు ఇస్తున్నారట. వచ్చే ఎన్నికల్లో ఆయన వారసుడికి టికెట్ ఇస్తానని హామీ కూడ ఇస్తున్నారట. ఈ హామీతో ఇంకొన్నాళ్లలో రాయపాటి వైసీపీకి గూటికి చేరడం ఖాయమని అంటున్నారు. అదే జరిగితే గుంటూరులో టీడీపీకి మరొక బలైమైన ప్రత్యర్థి తయారైనట్టే.
అదే విధంగా చిత్తూరు జిల్లాలో దశాబ్దాల తరబడి టీడీపీకి అండగా ఉన్న డీకే ఫ్యామిలీ సైతం వైసీపీ వైపు చూస్తుందనే టాక్ నడుస్తోయింది. టీడీపీలో మోస్ట్ సీనియర్ అనే పేరు తెచ్చుకున్న డీకే ఆదికేశవులునాయుడు మరణించాక ఆయన సతీమణి సత్యప్రభ పార్టీలో చురుగ్గా ఉంటూ వచ్చారు, 2014లో చిత్తూరు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆమె గత ఎన్నికల్లో రాజంపేట ఎంపీగా పోటీచేసి ఓడిపోయారు. వైసీపీలోని కీలక నేత అయిన పెద్దిరెడ్డి కుటుంబంతో వీరికి సన్నిహిత సంబంధాలున్నాయి. ఇప్పటికే వారికి జగన్ నుండి ఆహ్వానం వెళ్లినట్టు సమాచారం. డీకే శ్రీనివాస్ మాత్రం పార్టీ మార్పుపై వస్తున్న వార్తలను ఖండిస్తున్నారు. అయినా ఆయన పార్టీ మారడం ఖాయమనే ప్రచారం ముమ్మరంగా జరుగుతోంది. అదే జరిగితే చిత్తూరు జిల్లాలో టీడీపీ పరిస్థితి మరింత దారుణంగా తయారవడం ఖాయం.