వైఎస్ జగన్ ఇన్నాళ్లు బీజేపీని చూసీ చూడనట్టు వదిలేశారు. ఏం మాట్లాడినా ఎంత గోల చేసినా పట్టించుకోలేదు. ఒకానొక దశలో బీజేపీ వెళ్ళోనుకోవడానికి జగన్ సహకరిస్తున్నారని, ప్రతిపక్షం టీడీపీకి ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదిగితే వ్యతిరేక ఓట్లు చెలిపోయి తమకు ఎలాంటి ప్రమాదమో ఉండదన్నట్టు ప్లాన్ చేశారనే వాదనలూ వినబడ్డాయి. వాటిలో ఎంత వస్తముందో చెప్పలేం కానీ వైసీపీ ఇచ్చిన అలుసుతోటే బీజేపీ చెలరేగింది మాత్రం చెప్పొచ్చు. ప్రతిపక్షం మీద పడతారని అనుకుంటే ఏకంగా వైసీపీ మీదే పడ్డారు కాషాయ దళం. టీటీడీ బోర్డు వివాదాలు, ఆలయాల మీద జరుగుతున్న దాడులను ఆసరాగా తీసుకుని పాలకపక్షం మీద హిందూ వ్యతిరేక ముద్ర వేసే ప్రయత్నం చేశారు.
బీజేపీ పుంజుకోవడంతో ఎన్నడూ లేని తరహాలో రాష్ట్రంలో మతాల ప్రస్తావన తెరమీదకు వచ్చింది. ఒకానొక దశలో బీజేపీ స్పీడు చూసి టీడీపీయే ఖంగుతింది. సోము వీర్రాజుతో మొదలుకుని బీజేపీ నేతలంతా ఆలయాలు, దేవతా మూర్తుల విగ్రహాల ధ్వంసానికి వైసీపీయే కారణమని గట్టిగా వాదించారు. తిరుపతి ఉప ఎన్నికల్లో గెలవడానికి పాలక వర్గాన్ని ఎన్ని విధాలుగా భ్రష్టు పట్టించాలి అన్ని ప్రయత్నాలు చేశారు. ఇది జగన్ కు అస్సలు నచ్చలేదు. కేంద్రంలో అంతలా సహకారం ఇస్తున్నా రాష్ట్రంలో చూసీ చూడనట్టు పోతున్నా తమ మీదే ఎక్కేస్తున్నారనే ఆగ్రహం ఆయనలో మొదలైంది. దీంతో ఇక చెక్ పెట్టక తప్పదని అనుకున్నట్టున్నారు.
అందుకే కేంద్ర బడ్జెట్టును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గత బడ్జెట్టుతో పోలిస్తే ఈ బడ్జెట్టులో పెద్దగా తేడా ఏమీ లేదు. ఈసారి ఎలాగైతే రాష్ట్రానికి మొండిచేయి చూపించారో ఈసారి కూడ దాదాపు అలాగే చేశారు. కానీ గత బడ్జెట్టును మరో మాట లేకుండా పొగిడిన వైసీపీ ఈసారి మాత్రం ఇది ఎన్నికల బడ్జెట్టులా ఉందని విమర్శలకు దిగింది. రాష్ట్రానికి దక్కాల్సిన ప్రయోజనాలను పోరాడైనా దక్కించుకుంటామని అంటోంది. ఈ మార్పు చూస్తే ఏపీలో బీజేపీ నోరు మూయించడానికే బడ్జెట్ ఘాతాన్ని ఆయుధంలా వాడుకోవాలని, రేపు ఎప్పుడైనా బీజేపీ ఎక్కువ తక్కువలు చేస్తే రాష్ట్రానికి మీరు ఏమిచ్చారు అని నిలదీయవచ్చని అనుకుంటున్నట్టు ఉన్నారు. అంటే బీజేపీ ప్రయోగిస్తున్న మత రాజకీయంపై రాష్ట్ర సెంటిమెంట్ అనే ఆయుధాన్ని ప్రయోగిస్తారన్నమాట జగన్.