Jagan: చంద్రబాబుపై నిప్పులు కురిపించిన జగన్.. మళ్ళీ ఆ కష్టాలను ఎందుకు తెస్తున్నారంటూ!

Jagan: తాజాగా ఆంధ్రప్రదేశ్ లో రేషన్ షాపులు తెరుచుకున్న విషయం తెలిసిందే. దాంతో ఏపీ రాష్ట్ర రాజకీయాలలో చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ సీఎం చంద్రబాబుపై నిప్పులు కురిపించారు. ప్రజల ఇంటికే రేషన్ అందించే సౌకర్యాన్ని ఎందుకు తొలగిస్తున్నారు?అంటూ జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబుని ప్రశ్నించారు. గత ప్రభుత్వం ప్రారంభించిన డోర్ డెలివరీ విధానం ద్వారా ప్రజలకు సౌకర్యవంతంగా సేవలు అందాయని ఆయన చెప్పారు.

ఈ సందర్బంగా జగన్ ట్వీట్ చేస్తూ.. చంద్రబాబు నాయుడు.. ప్రజల ఇంటికే అందుతున్న సేవలపై మీకు ఎందుకు కక్ష? మళ్లీ పేదలకు రేషన్‌ కష్టాలు ఎందుకు తెస్తున్నారు? ప్రభుత్వం అంటే మంచి మనసుతో ఆలోచించి ప్రజల అవస్థలను తీర్చాలి కానీ, వారిని కష్టపెట్టడం సబబేనా? ప్రభుత్వ సేవల డోర్‌ డెలివరీ విధానాన్ని సమాధి చేయడం విజన్‌ అవుతుందా? మరోవైపు వైయస్సార్‌సీపీ తీసుకొచ్చిన 9,260 రేషన్‌ వాహనాలపై ఆధారపడ్డ దాదాపు 20 వేల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల పొట్ట కొట్టడం, వారి కుటుంబాలను రోడ్డున పడేయడం ఎంతవరకు సమంజసం?

ఈ ప్రభుత్వానికి మానవత్వం ఉందా? పారదర్శకంగా ఇంటివద్దకే వచ్చి సేవలు అందిస్తూ, వరదలు, విపత్తు సమయాల్లో బాధితులకు మరింతగా సేవలందించిన ఈ వాహనాలను తొలగించడం సరైనదేనా? పైగా ఈ సేవలందించిన వారిని ఉద్దేశిస్తూ వారు స్మగ్లర్లుగానూ, మాఫియా ముఠా సభ్యులుగానూ చిత్రీకరించేలా నిన్న మీరుచేసిన వ్యాఖ్యలు ఏమాత్రం సబబుగా లేవు అంటూ జగన్ మండి పడ్డారు. అయితే మరి జగన్ చేసిన ట్వీట్ పై చంద్రబాబు ఏ విధంగా స్పందిస్తున్నారో చూడాలి మరి.