రాజకీయాలు అంటే చాలామంది మోసాలు, కుళ్లు, కుతంత్రాలు, దోచుకోవడం అని చెప్తూ చాలా నెగటివ్ గా మాట్లాడుతారు. కానీ ఆ మాటలు పూర్తిగా నిజం కాదు. ఎందుకంటే రాజకీయం అంటే ప్రజాసేవ అనే రోజులు పోయాయి. ఇప్పుడు రాజకీయం అంటే వ్యూహ రచన. ఈ వ్యూహ రచనకు బలైన వారికి ఇది మోసంగా, కుతంత్రంగా కనిపిస్తుంది, వ్యూహం రచించిన వారికి ఇది రాజకీయంగా కనిపిస్తుంది. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది మోసం గురించి కాదు వ్యూహ రచన గురించి.
రాజకీయాల్లో ఎదగాలన్నా, ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నా నాయకుడికి ప్రజాసేవ చేసే ఆలోచన ఉన్నా లేకున్నా వ్యూహాలు రచించే తెలివితేటలు ఉండాలి. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు వ్యూహాలు రచించే వారిలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముందుంటారు.
చంద్రబాబు నాయుడు వ్యూహ రచన:
రాష్ట్రం విడిపోయిన తరువాత 2014లో జరిగిన ఎన్నికల్లో గెలవడానికి చంద్రబాబు నాయుడు వేసిన వ్యూహాలు అన్నీ ఇన్ని కాదు. జనసేన మద్దతు తీసుకున్నాడు, ఆలాగే కేంద్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్న బీజేపీతోను పొత్తు పెట్టుకొని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చి ఎన్నికల్లో గెలిచారు. గెలిచిన తరువాత తెలివిగా వైసీపీ నాయకులను కూడా తన పార్టీలోకి లాక్కున్నాడు. వైసీపీ బలహీన పరిచారు. అలాగే ఆంధ్రప్రదేశ్ కోసం రాజధానిని రాష్ట్రం నది బొడ్డులో ఉన్న అమరావతిలో ఏర్పాటు చేసి ప్రజల మద్దతు కూడగట్టుకున్నారు. ఆలాగే రాష్ట్రానికి ఒక నూతన రాజధానిని నిర్మించారనే క్రెడిట్ ను కూడా సొంతం చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. అలాగే రాష్ట్రంలో కాపుల ఉద్యమం చెలరేగినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు భయపడకుండా కేంద్రం అగ్రవర్ణ కులాల పేదలకు ఇచ్చిన 10% రిజర్వేషన్ లో కాపులకు 5% ఇచ్చి కాపుల అండను కూడకట్టుకున్నారు. ఇలా 2014-2019 కాలంలో చంద్రబాబు నాయుడు వేసిన వ్యూహాలు చాలా ఉన్నాయి.
చంద్రబాబు నాయుడుకి షాక్ ఇచ్చిన జగన్:
రాజకీయ వ్యూహాల్లో ఆరితేరిన చంద్రబాబు నాయుడుకి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో దిమ్మదిరిగే షాక్ ఇచ్చారు. 2014లో తన పార్టీ నుండి గెలిచిన నాయకులను చంద్రబాబు నాయుడు లాక్కునా కూడా భయపడకుండా రాష్ట్ర మంతట పాదయాత్ర చేస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, చంద్రబాబు నాయుడు చేస్తున్న తప్పులను ప్రజలకు వివరిస్తూ , ఒక్కసారి తనకు అవకాశం ఇవ్వాలని ఆర్థిస్తూ, 2019 ఎన్నికల్లో వైసీపీ పార్టీ అఖండ విజయాన్ని సాధించింది. అసెంబ్లీలో టీడీపీ నేతలు తనను ఎన్ని రకాలుగా విమర్శిస్తున్నా కూడా వాటికి ప్రతి విమర్శలు చేయకుండా ప్రజల్లో తనపై జాలి కలిగేలా చేసుకున్నాడు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ ప్రయాణానికి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా తోడు కావడంతో 2019 ఎన్నికల్లో టీడీపీని చిత్తుగా ఓడించారు. చంద్రబాబు నాయుడు వేసిన అన్ని వ్యూహాలను అర్జునుడిలా ఛేదించుకుంటూ చివరికి తాను అనుకున్న లక్ష్యాన్ని జగన్ చేరుకున్నారు.