తెలుగుదేశం పార్టీ కీలక నేతల్లో ఒకరు, విశాఖ రాజకీయాల్లో ముఖ్యుడు గంటా శ్రీనివాసరావు టీడీపీని వీడతారనే వార్తలు చాలారోజుల నుండి ప్రచారంలో ఉన్నాయి. కానీ ఇంకా ఆయన బయటికి వెళ్లలేదు. వైసీపీతో ఇంకా మంతనాలు జరుగుతున్నాయట. జగన్ సహా అందరు నేతలు గంటా పార్టీలోకి వస్తే విశాఖలో పార్టీకి తిరుగుండదని అనుకుంటుంటే విజయసాయిరెడ్డి మాత్రం గంటా రాకను ఆమోదించట్లేదు. కారణం గంటా పార్టీలోకి వస్తే తనకు పోటీ వస్తారనేది విజయసాయి దిగులట. అందుకే గంటా సైకిల్ దిగే కార్యక్రమం ఆలస్యమవుతూ వస్తోంది. కానీ ఎంత ఆలస్యమైనా శ్రీనివాసరావు వైసీపీలోకి వెళ్లడం మాత్రం ఖాయమంటున్నారు.
ఆ విషయం కాసేపు పక్కనపెడితే వైసీపీలోకి రావాలంటే ఒంటరిగా రాకూడదని, ఇంకో ఇద్దరు ఎమ్మెల్యేలను వెంటబెట్టుకుని రావాలని జగన్ గంటాకు కండిషన్ పెట్టారట. అన్నీ సక్రమంగా జరిగి ఉంటే విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబులతో కలిసి గంటా ఒకేసారి వైసీపీ కండువా కప్పుకునేవారు. కానీ విజయసాయిరెడ్డి అడ్డుతగలడంతో ఆ కార్యక్రమం వాయిదాపడింది. అయితే ఎప్పటికైనా వైసీపీలోకి వెళ్ళాల్సిందే కాబట్టి ముందు జగన్ పెట్టిన షరతును నెరవేర్చే పనిలో ఉన్నారట గంటా.
ఆ పని ఫలితమే తాజాగా వాసుపల్లి గణేష్ వైసీపీలోకి వెళ్లడమే. తన రాక ఆలస్యమవుతున్న కారణంగా ముందుగా అనుచరులను పంపేసి తర్వాత తాను వెళ్లాలని గంటా అనుకుని ఉండవచ్చు. వాసుపల్లి తరహాలోనే మరొక ఎమ్మెల్యే గణబాబు కూడ గంటా కంటే ముందే వైసీపీలోకి వెళ్లవచ్చని అంటున్నారు. త్వరలోనే ఆయన రాక మీద కూడ ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి గంటా జగన్ చెప్పినట్టే తన అనుచర ఎమ్మెల్యేలను వైసీపీలోకి మళ్లిస్తూ తన మార్గాన్ని సుగమం చేసుకుంటున్నారు. ఆసలు ఒక్కరే వస్తానంటే కాదు కాదు ఇంకో ఇద్దరిని వెంటబెట్టుకుని రమ్మన్న వైఎస్ జగన్ రాజకీయ ఎత్తుగడ ఎంత పదునో అర్థం చేసుకోవచ్చు.