కులాలు, మతాలను అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేయడం మన నాయకులకు అలవాటు, ప్రజలు కూడా సిగ్గు లేకుండా కులాన్ని, మతాన్ని చూసి ఓట్లేస్తూ ఉంటారు. ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లో టీడీపీని ఢీ కొట్టే పార్టీనే ఉండేది కాదు. ఒకప్పుడు టీడీపీ నాయకుడు తెలుగు రాష్ట్రాల రాజకీయాలను ఏక చక్రాధిపతిగా ఏలారు. టీడీపీ పార్టీ ప్రజల్లో అంత పెద్ద ఎత్తున నిలబడటానికి బీసీ కులస్తులు ముఖ్య కారణం. వాళ్ళు పార్టీని తమ భుజాలపై మోస్తూ ముందుకు నడిపించారు. టీడీపీ నాయకులు కూడా బీసీ నేతలను కంటికి రెప్పలా చూసుకున్నారు. అయితే 2019 ఎన్నికల తరువాత బీసీ నాయకులు మెల్ల మెల్లగా దూరం అవుతున్నారు.
పార్టీని విడుతున్న బీసీ నేతలు
టీడీపీ నుండి వైసీపీలోకి వెళ్తున్న నాయకుల్లో చాలా మంది అగ్రకులాలకు చెందిన వారే. వంశీ, కరణం బలరాం కమ్మ సామాజికవర్గానికి చెందినవారు కాగా గుంటూరు జిల్లా నుంచి గెలిచిన మద్దాల గిరి వైశ్య సామాజిక వర్గం. ఇలా నాయకులు పార్టీ విడుతున్నప్పటికి బీసీ నాయకులు, కులస్తులు తన పక్కన ఉన్నారని చంద్రబాబు నాయుడు సంతోష పడేవారు. అయితే ఇప్పుడు ఉత్తరాంధ్రకు చెందిన టీడీపీ నేత, ఎమ్మెల్యే, బీసీ నాయకుడు వాసుపల్లి గణేష్ కూడా వైసీపీలోకి వెళ్లడంతో చంద్రబాబు నాయుడు కంగారు పడుతున్నారు. తనకు ఇన్నాళ్లు అండగా ఉన్న బీసీ నాయకుడు ఇప్పుడు వైసీపీలోకి వెళ్లడంతో చంద్రబాబు నాయుడు, టీడీపీ నేతలు కంగారు పడుతున్నారు. గణేష్ ను టీడీపీ తరపున రాష్ట్ర బీసీ అధ్యక్షుడిగా చేయడానికి సిద్ధమవుతున్న బాబుకు గణేష్ షాక్ ఇచ్చారు.
బీసీ ట్యాగ్ ను తీయడానికి సిద్ధమవుతున్న జగన్
బీసీ నాయకుల అండతో టీడీపీ పార్టీ నడుస్తుందని తెలుసుకున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి, ఇప్పుడు ఆ బీసీ నేతలను టీడీపీకి దూరం చేయడానికి సిద్ధమవుతున్నారు. అలాగే టీడీపీకి ఉన్న బీసీల పార్టీ అనే ట్యాగ్ ను కూడా తీసేయడానికి వైసీపీ నేతలు పథకాలు రచిస్తున్నారు. ఇప్పటికే అనేకమంది బీసీ నేతలను పార్టీలో చేర్చుకుంటున్నారు. 2019 ఎన్నికల్లో దాదాపు అన్ని కులస్తుల ఓట్లను లాగేశారు, ఇప్పుడు ఈ బీసీలను కూడా తన పార్టీలో చేర్చుకొని టీడీపీని భూస్థాపితం చేయడానికి జగన్ పథకాలు రచిస్తున్నారు.