సీఎం జగన్ ఇప్పుడైనా ఆ సంచలన నిర్ణయం తీసుకుంటారా.?

Ys Jagan, It Is The Right Time To Take 'Decission'

Ys Jagan, It Is The Right Time To Take 'Decission'

కరోనా వైరస్ మొదటి వేవ్.. దేశానికి ఓ గొప్ప అవకాశాన్నిచ్చింది. అదే మద్య నిషేధానికి సంబంధించి. లాక్ డౌన్ నేపథ్యంలో మద్యం అమ్మకాలకు ఆస్కారం లేకుండా పోయింది. కానీ, లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా మద్యం దుకాణాలకు వెసులుబాటు కల్పించారు.. దాంతో, మద్యం దుకాణాల వద్ద పెద్దయెత్తున తోపులాటలు, తొక్కిసలాటలు జరిగాయి. దేశంలో కరోనా కేసులు అప్పట్లో గణనీయంగా పెరిగిపోవడానికి ఇది కూడా ఓ కారణం. అయితే, మద్యం దొరక్క మందుబాబులు కల్తీ సారా, కల్తీ కల్లు మాత్రమే కాదు, ఆఖరికి శానిటైజర్లు కూడా తాగేసి, ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. ఆంధ్రపదేశ్ రాష్ట్రంలోనూ పలువురు శానిటైజర్లు తాగి ప్రాణాలు కోల్పోయిన వైనం చూశాం.

ఇక, ఆంధ్రపదేశ్ ఎలాగూ దశలవారీ మద్య నియంత్రణ, చివరికి మద్య నిషేధం అంటోంది. ఇది ఎన్నికల హామీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి. ఆ లెక్కన, ఎటూ రెండేళ్ళు గడిచింది గనుక, సంపూర్ణ మద్య నిషేధాన్ని అమలు చేయడానికి ఇది చక్కని అవకాశం వైఎస్ జగన్ ప్రభుత్వానికి. మద్యం దుకాణాల్ని రాష్ట్రంలో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే తెరుస్తారు. నిజానికి, మిగతా పద్ధెనిమిది గంటలూ రాష్ట్రంలో కర్ఫ్యూ అమల్లో వుంటుంది. సో, ఆ ఆరు గంటలు మాత్రం ఎందుకు మద్యం అమ్మకాలకు అవకాశమివ్వాలి.? అన్న చర్చ సర్వత్రా వినిపిస్తోంది. ఎలాగూ సంపూర్ణ మద్య నిషేధాన్ని ఇంకో రెండు మూడేళ్ళలో అమలు చేయాలి గనుక, ఆ పనేదో ఇప్పుడే చేసెయ్యడం వైఎస్ జగన్ ప్రభుత్వానికి కాస్తంత తేలికైన వ్యవహారమే అవుతుంది. కొందరికి ప్రత్యేక వెసులుబాట్లు కల్పించి మద్య నిషేధం అమలు చేస్తే, ప్రభుత్వానికి వచ్చే మంచి పేరు అంతా ఇంతా కాదు. కానీ, ప్రస్తుతం వున్న ఆర్థికపరమైన ఇబ్బందుల నేపథ్యంలో మద్యంపై ఆదాయం ప్రభుత్వానికి తప్పనిసరి. అందుకే, మద్య నిషేధంపై ఇప్పుడెలాంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకోకపోవచ్చన్న వాదనలు అంతటా వినిపిస్తున్నాయి. కానీ, ఇలాంటి అవకాశం ఇంకోసారి మళ్ళీ రాదు. సో, జగన్ సర్కార్ ఇక్కడే తెలివిగా ఆలోచిస్తే.. అది రాష్ట్ర భవిష్యత్తుకూ ఎంతో ఉపయుక్తంగా వుంటుంది.