YS Jagan : సీఎం వైఎస్ జగన్‌లో పెరుగుతున్న భయానికి కారణమిదే.!

YS Jagan :ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి భయమంటే ఏంటో తెలియదని వైసీపీ నేతలు అంటుంటారు. వైసీపీ అధినేతగా ఆయనకు భయం వుండకపోవచ్చుగాక. కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయనలో రోజురోజుకీ భయం పెరుగుతోంది. కరోనా సహా అనేక కారణాలతో రాష్ట్ర ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది. ఈ విషయాన్ని స్వయంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒప్పుకుని తీరాల్సి వస్తోంది.

‘అబ్బే, ఆదాయం గణనీయంగా పెరుగుతోంది..’ అంటూ కొందరు వైసీపీ నేతలు చేస్తున్న బుకాయింపులకీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడిస్తున్న వాస్తవ వివరాలకీ అస్సలు పొంతన వుండదు. ఔను, అప్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.. వాటికి చెల్లించాల్సిన వడ్డీ కూడా కళ్ళ ముందే కనిపిస్తోంది. ఖర్చుల సంగతి సరే సరి. దాపరికం ఏమీ లేదిక్కడ రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించి.

ఉద్యోగులు డిమాండ్ చేస్తున్న పీఆర్సీ విషయమై పెద్ద రచ్చే జరుగుతోంది. తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దగ్గర పంచాయితీ జరిగింది. ముఖ్యమంత్రి, ఉద్యోగ సంఘాల నేతలకు క్లాస్ పీకినంత పని చేశారు.. బుజ్జగిస్తూనే. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోవాలని ఉద్యోగులకు సూచించారు. ‘ఇప్పుడు మీరు కోరినట్లు చేస్తే, ముందు ముందు మరింత ఇబ్బంది పడతాం..’ అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

ఇది నిజానికి ‘భయానికి సంకేతం’గా చెప్పుకోవచ్చు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలాంటి సవాళ్ళను ఎదుర్కొంటోందో ముఖ్యమంత్రి మాటల్ని బట్టి అర్థమవుతోంది. అయితే, పబ్లిసిటీ ఖర్చులు (పత్రికల్లో ప్రకటనలు సహా, సలహాదారులకు చెల్లింపులు) తగ్గించుకుంటే కొంతమేర ఉపశమనం దొరుకుతుందన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. కానీ, అందుకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేయకపోవచ్చు.

ఏదిఏమైనా, రానున్న రెండేళ్ళు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పెను సవాల్.. అనే చెప్పాలి. ఇప్పుడే ఇలా భయపడుతోంటే, ముందు ముందు పరిస్థితులు ఇంకెలా వుంటాయో ఏమో.!