ఇలాగైతే వైఎస్ జగన్ పాద యాత్ర చేయగలిగేవారా.?

చంద్రబాబు హయాంలో అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎలాంటి ఆటంకాలూ లేకుండా ప్రజా సంకల్ప యాత్ర చేసుకోగలిగారు.! సరే, తెరవెనుకాల రాజకీయ కుట్రలనేవి ఏ రాజకీయ పార్టీ అయినా చేసేవే. కానీ, జనాల్లో మాత్రం, ‘చంద్రబాబు పద్ధతైన రాజకీయం చేయబట్టే, వైఎస్ జగన్ అంత స్వేచ్ఛగా పాదయాత్ర చేసుకోగలిగారు..’ అన్న ముద్ర పడిందన్నది నిర్వివాదాంశం.

మరి, ఇప్పుడు జరుగుతున్నదేంటి.? చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పం వెళితే, అక్కడ వైసీపీ శ్రేణులు అడ్డగించాయి. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే. ఓ పార్టీ రాజకీయ కార్యకలాపాలకు ఇంకో రాజకీయ పార్టీ అడ్డుపడకూడదు. అందునా, అధికార పార్టీ అసలే అడ్డు పడకూడదు.

కొన్నాళ్ళ క్రితం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని టీడీపీ నేతలు విమర్శించారన్న కారణంగా, ఏకంగా టీడీపీ రాష్ట్ర కార్యాలయం మీదనే వైసీపీ శ్రేణులు దాడులు చేయడం చూశాం. ఇది అరాచక పాలనకు నిదర్శనం.. అన్నదాంట్లో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు.

వైసీపీ సర్కారు ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేసినా, ‘శాంతి భద్రతల వైఫల్యం’ అనేది చాలా చాలా పెద్ద సమస్య అవుతుంది.. ప్రజల్లో ప్రభుత్వం పట్ల అసహనానికి కారణమవుతుంది. కుప్పంలో టీడీపీ శ్రేణుల అత్యుత్సాహం అనేది లెక్కల్లోకి రావడంలేదు. కేవలం అధికార పార్టీ అరాచకమే హైలైట్ అవుతుంది. ఎందుకంటే, అధికార పార్టీ కంట్రోల్‌లో వుండాలి, తమ హయాంలో నడుస్తున్న ప్రభుత్వానికీ, పోలీసు వ్యవస్థకీ సహకరించాలి.

వైసీపీకి కాస్తో కూస్తో అనుకూలంగా వున్న మీడియా సంస్థలు కావొచ్చు, రాజకీయ విశ్లేషకులు కావొచ్చు, జర్నలిస్టులు కావొచ్చు, సామాజిక వేత్తలు కావొచ్చు.. ఈ విషయంలో వైసీపీనే తప్పు పడుతున్నారంటే, వైసీపీ అధినాయకత్వం ఆత్మవిమర్శ చేసుకోవాలి కదా.?