ఏపీ హెచ్చార్సీ హెడ్ క్వార్టర్ కర్నూలు: జగన్ కల నెరవేరుతోంది.!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హ్యూమన్ రైట్స్ కమిషన్ హెడ్ క్వార్టర్‌గా కర్నూలు అద్భుతమైన అవకాశాన్ని దక్కించుకుంది. న్యాయ రాజధాని దిశగా ఇది కీలకమైన ముందుడుగా భావించొచ్చు. వైఎస్ జగన్ ప్రభుత్వం, రాష్ట్రానికి మూడు రాజధానుల్ని ప్రకటించిన విషయం విదితమే. అయితే, కోర్టు కేసుల కారణంగా మూడు రాజధానుల అంశం ప్రస్తుతానికి ‘హోల్డ్’లో వుంది. అయితే, రాష్ట్ర హెచ్చార్సీ కార్యాలయాన్ని త్వరగా ఏర్పాటు చేయాలని హైకోర్టు ఇటీవల ఆదేశించడంతో, కర్నూలులో అనుకూల భవనాల్ని పరిశీలించింది సంబంధిత కమిటీ. అనంతరం ప్రభుత్వానికి సదరు కమిటీ నివేదిక కూడా ఇచ్చింది. కమిటీ నివేదిక ఆధారంగా, త్వరలో హెచ్చార్సీ హెడ్ క్వార్టర్ కర్నూలుకి తరలించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

హైకోర్టు ఎక్కడ వుంటే, హెచ్చార్సీ హెడ్ క్వార్టర్ కూడా అక్కడే వుండాలన్న వాదనను కొందరు తెరపైకి తెస్తున్నారు. ప్రస్తుతానికి హైకోర్టు అమరావతిలోనే వుంది. అక్కడి నుంచి హైకోర్టు, మరో చోటకి మారాలంటే, దానికోసం చాలా పెద్ద ప్రక్రియ నడవాల్సి వుంటుంది. ఇదిలా వుంటే, కర్నూలు న్యాయ రాజధానిగా ముందడుగు వేసిన దరిమిలా, విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా ఎప్పుడు ముందడుగు వేస్తుందన్న చర్చ ఏపీ రాజకీయాల్లో నడుస్తోంది. కాగా, అమరావతి పరిస్థితేంటి.? అన్న చర్చ కూడా తెరపైకొస్తోంది. పేరుకి శాసన రాజధాని అని జగన్ ప్రభుత్వం చెబుతున్నా, పలువురు మంత్రులు అమరావతిని స్మశానంగా, ఎడారిగా, ముంపు ప్రాంతంగా అభివర్ణిస్తున్న దరిమిలా, అమరావతి భవిష్యత్ అగమ్యగోచరమే. కానీ, రానున్న రెండేళ్ళలో రాష్ట్రంలో రాజధానికి సంబంధించి కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటాయనిగానీ, వాటి కారణంగా రాజధాని తరలి వెళ్ళిపోతుందనిగానీ చెప్పలేం.