స్థానిక ఎన్నికల కోసం వైసీపీ నాయకులు ఎదురు చూసిన్నంత దేశంలో ఎక్కడా ఏ నాయకులు ఎదురు చూసి ఉండరు. ఎట్టి పరిస్థితుల్లో స్థానిక ఎన్నికలు నిర్వహించాలని వైసీపీ ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేసింది. కరోనా సమయంలో ఎన్నికలు నిర్వహించడం కుదరదని చెప్పిన ఎస్‌ఈసీని కూడా తొలగించింది. అయితే ఇప్పుడు కరోనా కాలంలో ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని చెప్తూ వైసీపీ ప్రభుత్వం యు టర్న్ తీసుకుంది.
యూ టర్న్ తీసుకున్న జగన్
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలంటూ.. తాండవ యోగేష్ అనే న్యాయవాది హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై విచారణలో ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కష్టమని ఏపీ ప్రభుత్వం ధర్మాసనానికి తెలిపింది. కరోనా భయం ప్రజల్లో అధికంగా ఉన్నప్పుడే ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధమైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడెందుకు వద్దంటుంన్నారో ఎవ్వరికీ అర్ధం కావడం లేదు. ప్రస్తుతం దేశం కరోనా భయం నుంచి బయటపడుతోందని, ఏపీలో కూడా లాక్ డౌన్ ఎత్తేశారని, బీహార్ సహా అనేక రాష్ట్రాల్లో ఎన్నికలు కూడా జరుగుతున్నాయని పిటిషనర్ తరపు న్యాయవాది ప్రస్తావించారు. అయినప్పటికీ ప్రభుత్వం ఎన్నికలు ఇప్పుడు సాధ్యం కాదని తెలిపింది. దింతో రాష్ట్ర ఎన్నికల సంఘం అభిప్రాయం తెలపాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది.
జగన్ ఎందుకు యూ టర్న్ తీసుకున్నారు?
స్థానిక ఎన్నికలను వాయిదా వేయడానికి ఎన్నికల కమీషన్ నిమ్మగడ్డ రమేష్ కారణమని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఆయన పదవిలో ఉన్నంతకాలం స్థానిక ఎన్నికలు నిర్వహించకూడదని వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలుస్తుంది. వచ్చే మార్చి వరకూ ఎస్‌ఈసీ పదవీ కాలం ఉంది. అందుకే ఇప్పుడు సాధ్యం కాదని హైకోర్టుకు చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్ణయమే ఫైనల్. ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. ఆయన ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధమైతే జగన్ అధికారులు సహకరిస్తారో లేదో వేచి చూడాలి.