ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై ఏపీ సీఎం వైఎస్ జగన్ తీపి కబురు.!

‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పరిస్థితి మెరుగ్గా వుంది. ఆ మాటకొస్తే చాలా బావుంది..’ ఇదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సాక్షాత్తూ అసెంబ్లీలో సెలవిచ్చిన అంశం.

ఉమ్మడి తెలుగు రాష్ట్రం విభజనతో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నమాట వాస్తవం. ఆర్థిక లోటు, సౌకర్యాల లేమి.. చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలతో 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. ఇప్పుడు జిల్లాల సంఖ్య పెరిగింది కాబట్టి.. సమస్యలన్నీ అటకెక్కిపోయాయా.? అలా అనడం సబబు కాదు.

గడచిన ఎమినిదేళ్ళలో చాలా మారాయ్.! అందునా, గడచిన మూడేళ్ళలో అత్యద్భుతమైన పాలన అందించామని వైసీపీ సర్కారు అంటోంది. అందుకే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థిక ప్రగతిని సాధించిందన్నది వైఎస్ జగన్ ఉవాచ. శ్రీలంకతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విపక్షాలు పోల్చడం దుర్మార్గమని వైఎస్ జగన్ మండిపడ్డారు.

గత ప్రభుత్వ హయాంలో జరిగిన అప్పులు, అంతకు ముందు రాష్ట్రానికి వున్న అప్పులు.. తమ హయాంలో చేసిన అప్పుల గురించి కూడా వైఎస్ జగన్ సవివరంగా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక ప్రగతి అత్యద్భుతంగా వుంటే, ఎప్పటికప్పుడు రాష్ట్రం ఎందుకు అప్పులు చేయాల్సి వస్తోందట.? ఈ ప్రశ్నకు వైఎస్ జగన్ సమాధానం చెబుతారో చెప్పరో మరి.!

ఒక్కటైతే నిజం. టీడీపీ ఆరోపిస్తున్నట్లుగా శ్రీలంక స్థాయి సంక్షోభ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేవు. కానీ, అప్పులైతే గట్టిగానే జరుగుతున్నాయ్. రాష్ట్రంపై అప్పుల భారం పెరుగుతోంది. దానికి వైఎస్ జగన్ సర్కారు ఎలాంటి భాష్యం చెప్పినా, ఈ అప్పులు.. ముందు ముందు రాష్ట్ర ప్రగతిని దెబ్బ తీస్తాయ్.!