వైసీపీలో పాలన వ్యవహారాలే కాకుండా పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాలు కూడ గట్టిగానే జరుగుతున్నాయి. గత ఎన్నికల ఫలితాలను చూసుకున్న వైఎస్ జగన్ ఏయే వైపుల నుండి తమకు మద్దతు తక్కువైంది, ప్రత్యర్థుల బలాలు ఎక్కడ ఉన్నాయి అనే అంచనాలను వేసుకుని వాటికి అనుగుణంగా చర్యలు చేపడుతున్నారు. ఆయన లెక్కల్లో గత ఎన్నికల్లో ప్రధాన సామాజికవర్గాల్లో ఒకటైన కమ్మ సామాజిక వర్గంలో వైసీపీ కొంచెం బలహీనంగా ఉందని తేలిందో ఏమో కాని ఆ వర్గం మీద ద్రుష్టి పెట్టారు. పార్టీలో ఉన్న కమ్మ వర్గానికి చెందిన నేతలను రంగంలోకి దింపుతున్నారట. అలా రంగంలోకి దిగిన వారిలో కొడాలి నాని ప్రముఖంగా కనిపిస్తున్నారు. ప్రజెంట్ నానికి జగన్ అప్పగించిన టాస్క్ కమ్మ వర్గంలో పార్టీని బలపరచడమే.
అందుకు నాని అనుసరిస్తున్న వ్యూహం కమ్మ వర్గానికి చెందిన నాయకులను తమ వైపుకు తిప్పుకోవడమే. కమ్మ వర్గ నేతలు ఎక్కువగా ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ. మొదటి నుండి ఆ సామాజిక వర్గం టీపీకి, చంద్రబాబుకు వెన్నుదన్నుగా ఉంటూ వస్తోంది. కానీ గత ఎన్నికల్లో మాత్రం కమ్మ వర్గం ఎందుకనో చంద్రబాబు పట్ల కాస్త విముఖత చూపారు. ఆ వర్గం ఓటర్లు కొంత శాతం చీలిపోయి వైసీపీకి మద్దతు ఇచ్చారు. అందుకే చంద్రబాబు ఖచ్చితంగా గెలుస్తామని అనుకున్న కొన్ని చోట్ల ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఎలాగూ కొంత మద్దతు లభించింది కాబట్టి పూర్తిగా కమ్మ వర్గాన్ని తమవైపుకు తిప్పుకోవాలనేది జగన్ వ్యూహం. అందుకే ఆ వర్గ నేతలను వల వేసి పట్టుకునే పనిలో ఉన్నారు నాని.
ఇప్పటికే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చంద్రబాబు నాయుడుకు అడ్డం తిరిగి వైసీపీకి జైకొట్టారు. ఇంకో కమ్మ వర్గపు ఎమ్మెల్యే కరణం బలరాం కూడ వైసీపీతో కలిసి నడుస్తున్నారు. ఆయన కుమారుడు అధికారికంగా వైసీపీలో చేరిపోయారు. ఇప్పుడు నాని చూపు విశాఖ మీద పడింది. విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబును తమవైపుకు తిప్పుకోవాలని ట్రై చేస్తున్నారు కొడాలి నాని. వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనకు పార్టీలో, నియోజకవర్గంలో మంచి పేరుంది. సౌమ్యుడిగా కమ్మ వర్గంలో పేరున్న వ్యక్తి. అందుకే ఆయన్ను తమలో కలుపుకుంటే కమ్మ వర్గం వైసీపీ వైపుకు మళ్లుతుందనే ఆలోచనలో ఉన్నారు నాని. ఇప్పటికే నాని వెలగపూడితో సంప్రదింపులు జరుపుతున్నారు. అవి ఫలిస్తే ఆయన వైసీపీలో చేరడం ఖాయం అంటున్నారు స్థానిక నేతలు. మొత్తానికి జగన్ అప్పగించిన పనిని కొడాలి నాని నూటికి నూరు శాతం విజయవంతం నిర్వహిస్తున్నారు.