చంద్రబాబు నాయడును అనుంగ మీడియా అయిన ఎల్లో మీడియా వైఎస్ జగన్ మీద చేస్తున్న అక్షర దాడి అంతా ఇంతా కాదు. ఆ అక్షరాల్లో నిజాయితీ లేకపోగా టన్నుల కొద్దీ ద్వేషం కనబడుతోంది. ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడు, సదరు ఎల్లో మీడియా పెద్ద ఏం మాట్లాడుకున్నారో ఏమో కానీ ప్రతి సెకనూ జగన్ మీద బురద చల్లడానికే వాడుకుంటున్నారు. చేతిలో పత్రిక, ఛానెల్ ఉన్నాయి కదా అని అదే పనిగా విషపు రాతలు రాస్తూనే ఉన్నారు. జగన్ ఏం చేసినా దాన్ని చెడుగానే చూపిస్తున్నారు. కొత్త పలుకులు అంటూ చెత్త పలుకులు పలుకుతూ పేపర్ నిండా నెగెటివిటీని నిమ్పేస్తి జనం చేతిలో పెడుతున్నారు.
ఇప్పటికే ఎల్లో మీడియా అసలు రంగేమిటో జనానికి బాగా తెలిసొచ్చింది. ఎంత రాజకీయ శత్రువులైతే మాత్రం ఇంత దిగజారి తూలనాడతారా అంటూ విసుక్కుంటున్నారు. జగన్ ఏదైనా సంక్షేమ పథకం కిందైనా నగదు బదిలీ చేస్తే దాని వలన భవిష్యత్తు నాశనమవుతుంది కలరింగ్ ఇస్తున్నారు. అప్పులు పెరుగుతున్న మాట నిజమే కానీ మరీ ఎల్లో మీడియాలో చెబుతున్నట్టు జనాలు రోడ్ల మీద పడిపోయే పరిస్థితి అయితే లేదు. ఇక చంద్రబాబును హీరోలా చూపే తొందరలో ఏం రాస్తున్నారో సోయి లేకుండా రాసేస్తున్నారు. సీఎం చేసే ప్రతి పనిని చంద్రబాబు అడ్డుకుంటున్నారని బాహాటంగానే చెప్పేస్తున్నారు.
ముఖ్యమంత్రి పనులకు అడ్డుపడటం అంటే అది పాలనకు, రాష్ట్ర అభివృద్ధికి అడ్డం పడటమే. ఈ సంగతి చంద్రబాబుకు తెలియనిది కాదు. కానీ ఎల్లో మీడియా పెద్దమనిషికే తెలియట్లేదు. జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా కోర్టుకు వెళుతూ చంద్రబాబు వాటిని ఆపేస్తున్నారని తాటికాయంత అక్షరాలతో పేపర్లో, గంటల గంటల డిబేట్లు పెట్టి ఛానెల్ లో ఊదరగొడుతూ తెలియకుండానే బాబుగారి మీద నెగెటివిటీ పెంచేస్తున్నారు. ఇప్పటికే జగన్ సహా వైసీపీ నేతలంతా జగన్ కష్టపడుతుంటే చంద్రబాబు ఆయనకు అడ్డుపడుతున్నారని, ఏ పనీ చేయనివ్వట్లేదని గగ్గోలు పెడుతున్నారు. ఎల్లో మీడియా రాతలు, కథనాలు కూడ అలానే ఉన్నాయి. రేపు పలనా పని ఎందుకు చేయలేదని, పలనా హామీని ఏ కారణంగా నెరవేర్చలేదని జనం జగన్ ను ప్రశ్నిస్తే ఆయన చెప్పే ఏకైక మాట చంద్రబాబు అడ్డుపడ్డారు.
ఇది జగన్ పట్ల సానుభూతిని పెంచేస్తుంది. శకునిలా దొంగ ఎత్తులు వేస్తే చిన్నవాడైన జగన్ మాత్రం ఏం చేస్తాడు అనొచ్చు జనం. కాబట్టి ఎల్లో మీడియా కొంచెం అత్యుత్సాహం తగ్గించుకుని జగన్ మీద విషం చిమ్మడం, చంద్రబాబును అనవసరంగా హీరోను చేయడం మానుకుంటే మంచిది. లేకపోతే చంద్రబాబు ఆయనతో పాటు టీడీపీ నట్టేట్లో మునిగిపోతాయి.