ఏపీలోని తెలుగు వార్తా పత్రికలు, న్యూస్ ఛానెళ్లు రెండు పార్టీల కోసమే పనిచేస్తున్నాయనేది అందరికీ తెలిసిన వాస్తవం. ఆ రెండు పార్టీల గురించే ఊదరగొడుతూ వారు చేసే ప్రతి పనిని అద్భుతాలుగా వర్ణించే సదరు మీడియా సంస్థలు మొక్కుబడిగానైనా మీడియా కర్తవ్యాన్ని నిర్వర్తించడం లేదు. ఎంతసేపూ సొంతవారిని పొగడటం అవతలివారి మీద బురద చల్లడం తప్ప ఇంకొక పనేమీ ఉండదు వారికి. మరీ ముఖ్యంగా ప్రణాళిక ప్రకారం పవన్‌ను తీవ్రంగా నిర్లక్ష్యం చేశారు. జనసేనను జనంలోకి వెళ్లకుండా చేయడానికి కనీసం పవన్ ఊసు కూడ ఎత్తేవారు కాదు. టీడీపీ, వైసీపీ నేతలు దగ్గినా కూడ ఆయా పత్రికలో ఫ్రంట్ పేజీలో వార్తలు పడతాయి కానీ పవన్ ముఖ్యమైన విషయాలను చర్చకు తెచ్చినా ఎక్కడో 10వ పేజీ తర్వాత ఒక మూలాన మొక్కుబడి ఒక చిన్న వార్త పడేది.
ఎన్నికలు ముగిసినా కూడ అదే విధానాన్ని అవలంభించారు. కానీ పవన్ మాత్రం తగ్గలేదు. ఈమధ్య డోస్ పెంచి ప్రభుత్వం మీద విరుచుకుపడిపోతున్నారు. పవన్ చేసిన గుడివాడ టూర్, దివీస్ కు వ్యతిరేకంగా పెట్టిన బహిరంగ సభ బాగా క్లిక్ అయ్యాయి. ఎన్నడూ లేని రీతిలో ఎల్లో మీడియా పవన్ కు కవరేజ్ ఇవ్వడం మొదలుపెట్టింది. ఎల్లో మీడియా ప్రప్రథమ కర్తవ్యం చంద్రబాబును ఆకాశానికెత్తడం. నిత్యం భజన చేస్తూ బాబుగారి గోప్పతనాన్ని జనం మీద రుద్దడం. ఇన్నాళ్లు అదే చేసిన వారిని గత ఏడాదిన్నరగా అది భారమైపోయింది. ఎన్నికల్లో ఓడటంతోనే చంద్రబాబును జనం దారుణంగా తిరస్కరించారనేది స్పష్టం. అలంటి ఆయను మహా గొప్ప వ్యక్తిగా చూపడం, ఎన్నికల్లో ఆయన ఓడిపోయి ఉండాల్సింది కాదని అంటుండటం ఎంతవరకు మేధావితనం అవుతుంది. అందుకే జనం పచ్చ మీడియా పైత్యాన్ని పట్టించుకోలేదు.
పైగా బాబుగారి చర్యలు కూడ ఏమంత చురుగ్గా లేవు. ఏదో వారం పదిరోజులుగా దేవుళ్లను అడ్డుపెట్టుకుని హడావుడి చేస్తున్నారు కానీ లేకపోతే ఆమాత్రం అటెంక్షన్ కూడ ఉండేది కాదు. జనంలో ఆయన మీద ఆసక్తి తగ్గిందనేది వాస్తవం. అందుకే ఎల్లో మీడియా ఇక బాబుగారిని ఎంతలేపినా లాభం లేదని తెలుసుకున్నట్టు ఉంది. అందుకే పవన్ మీద దృష్టిపెట్టింది. పవన్ చేసే పనులను ఆహా ఓహో అనకపోయినా ప్రముఖంగా ప్రస్తావిస్తోంది. తరచూ పేపర్, ఛానెల్, వెబ్ మీడియాలో పవన్ ప్రస్తావన ఉండేలా చూసుకుంటోంది. పవన్ పనులను పొగుడుతూ అలా చేయబోతున్నాడు, ఇలా చేయబోతున్నాడు అంటూ హైప్ ఇస్తున్నారు.
ఈ మార్పును చూస్తే గట్టిగా పోరాడుతున్న పవన్ కు కాస్త పుష్ ఇస్తే అధికార పక్షాన్ని ఇబ్బందుల్లోకి నెట్టవచ్చనేది వారి ఆలోచనేమో అనిపిస్తోంది. అంతేకాదు పవన్ కు ఎల్లో మీడియా మీద పీకల్లోతు కోపం ఉంది. చంద్రబాబును పట్టించుకోకపోవడాన్ని అది కూడ ఒక రీజనే. కాబట్టి పవన్ మీద నెగెటివిటీ తగ్గించి కాస్త పొగిడితే ఆయన మనసు మారి బాబుగారికి దగ్గరవుతారనే ప్లాన్ అయినా అయ్యుండొచ్చు.