వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొన్నాళ్ళుగా ఓ ఎమ్మెల్యే పేరు తరచూ వార్తల్లోకెక్కుతూ వుంది. సదరు ఎమ్మెల్యే, పార్టీ పట్ల విధేయుడిగా వుండడంలేదనీ, పార్టీకి చెందిన నేతల్ని లెక్క చేయడంలేదనీ ఆరోపణలు వస్తున్నాయి. దాంతో, ఆ ఎమ్మెల్యేకి స్థానిక వైసీపీ నేతల నుంచే కాదు, పార్టీ అధిష్టానం నుంచి కూడా సరైన సహాయ సహకారాలు అందడంలేదట. ఇంకోపక్క, సొంత పార్టీకి చెందినవారితో కాకుండా, ఇతర పార్టీలకు చెందినవారితో సదరు ఎమ్మెల్యే సన్నిహితంగా మెలుగుతున్నారట. ప్రభుత్వపరమైన కొన్ని అంశాల విషయంలోనూ, ఇతరులకే అధిక ప్రాధాన్యతనిస్తున్నారట సదరు ఎమ్మెల్యే.
గతంలో ఆయన ఓ ఎంపీగా కూడా పనిచేశారు. అప్పుడు సైతం, జనసేన పార్టీ పట్ల అమితమైన ప్రేమ చూపిన ఆయన, 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి టిక్కెట్ పొందడమే అద్భుతం.. అని అనుకున్నారు. టిక్కెట్ దక్కినా ఆయన ఓడిపోతారన్న భావన చాలామందిలో నెలకొంది. కానీ, వైఎస్ జగన్ వేవ్ ఆయన్ని గెలిపించింది. ఐఏఎస్ అధికారిగా కూడా గతంలో ఆయన పనిచేశారు. ఇప్పుడాయన మీద వైసీపీ అధిష్టానం వేటు వేయబోతోందన్న ప్రచారం జరుగుతోంది. అందుక్కారణం, తిరుపతి ఉప ఎన్నికలో ఆయన సరిగ్గా పనిచేయలేదట. ఆ కారణంగానే ఆశించిన మెజార్టీలో కొంతమేర తగ్గిందన్న భావన వైసీపీ అధిష్టానంలో వ్యక్తమవుతోందట. మరోపక్క, సదరు వైసీపీ ఎమ్మెల్యే, జనసేన పార్టీ పట్ల సానుకూలంగా వున్నారనీ, అయితే, బీజేపీలోకి వెళితే తన భవిష్యత్తు బావుంటుందా.? అన్న ఆలోచనలోనూ వున్నారంటూ రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోపక్క, సదరు వైసీపీ ఎమ్మెల్యే, ఆ మధ్య తన మీద వస్తున్న పార్టీ మార్పు విమర్శలపై తీవ్రంగా స్పందించారు. తాను పార్టీని వీడబోవడంలేదనీ, వైఎస్ జగన్ పట్ల తనకు అమితమైన అభిమానం వుందనీ చెప్పుకున్నారు. మరి, ఇప్పుడు ఈ చర్చ ఏంటి.? వైసీపీ అనుకూల మీడియా నుంచే ఆయనకు ఈ సెగ ఏంటి.? ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే.? ఇంకెవరు వరప్రసాద్.. తిరుపతి నుంచి గతంలో ఎంపీగా పనిచేశారీయన.