‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మిస్సింగ్..’ అంటూ ఎవరో సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టారట.. అది పట్టుకుని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మీడియా ముందుకొచ్చేయడమట. రాజకీయాల్లో అత్యంత దిగజారుడు స్థాయిని కేవలం ఆంద్రపదేశ్ రాష్ట్రంలోనే చూస్తున్నామేమో. ఎవరికీ బాధ్యత లేదు. అధికారపక్షమేమీ ఇందుకు మినహాయింపు కాదు. తమకు అవకాశమున్నంతమేర రాష్ట్ర ప్రజల్ని ఆదుకోవాలన్న సోయ ఎవరిలోనూ కనిపించడంలేదని జనం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద జుగుప్సాకరమైన విమర్శలు చేయడం ద్వారా రఘురామకృష్ణరాజు సాధించేదేంటి.? సొంత నియోజకవర్గం నర్సాపురం వెళ్ళలేని దయనీయ స్థితి ఆయనది.
చాలా నెలలుగా ఆయన తన సొంత నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడలేదు. తమ నియోజకవర్గ ప్రజా ప్రతినిథి, తమ సమస్యల కోసం పనిచేయాలని ప్రజలు కోరుకోవడం తప్పెలా అవుతుంది.? కరోనా కష్ట కాలంలో ఏదో ఒక రూపంలో ఎంపీ, తన నియోజకవర్గ ప్రజలకు అండగా నిలవాల్సి వుంటుంది. ఎంపీగా తనకు వచ్చే నిధులతో కావొచ్చు, అధికారాలతో కావొచ్చు.. ప్రజలు కరోనా నుంచి కాస్త కోలుకునేలా చేయడానికి ఆస్కారమున్నా.. ఆ గొప్ప అవకాశాన్ని ఆయన సద్వినియోగపరచుకోలేకపోతున్నారు. మరోపక్క రఘురామ, ఏపీకి వస్తే అరెస్టు చెయ్యాలని అధికార పార్టీ చూస్తోంది. వాళ్ళలా ప్లానేశారు గనుక, నేనిలా ఢిల్లీకే పరిమితమవుతాను, మీడియా ముందుకొచ్చి నానా రకాల విమర్శలూ చేస్తానంటే అది సంస్కారం కానే కాదు. వైసీపీ ద్వారా వచ్చిన ఎంపీ పదవికి రాజీనామా చేసి, ఆ తర్వాత వైసీపీ అధినేతను రఘురామకృష్ణరాజు విమర్శించుకోవచ్చుగాక. ఈ మధ్య మిమిక్రీ కూడా నేర్చుకున్నట్టున్నారు ఈ రెబల్ ఎంపీ. ఆ పైత్యాన్నంతా రఘురామ, వైఎస్ జగన్‌ని విమర్శించడంలో చూపుతున్నారు. రాజకీయాల్లో అస్సలేమాత్రం ఆహ్వానించదగ్గ పరిణామం కాదిది.