2019 ఎన్నికల్లో నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచిన రఘురామకృష్ణరాజు, సొంత పార్టీని దెబ్బతీయడానికి చాలా చాలా ప్రయత్నాలే చేస్తున్నారు. పార్టీ తనను సస్పెండ్ చేయదన్న ధైర్యంతో, అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. అత్యంత జుగుప్సాకరమైన వ్యాఖ్యలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద ఇప్పటికే చేశారు.. రాజద్రోహం కేసులో అరెస్టయి, బెయిల్ మీద బయటకు వచ్చారు.
ఇదంతా ఓ ఎత్తయితే, తన మీద థర్డ్ డిగ్రీ టార్చర్.. ఏపీ సీఐడీ ప్రయోగించిందంటూ జాతీయ స్థాయిలో లేఖాస్త్రాల ద్వారా ప్రచారం చేస్తున్నారు రఘురామ. ఇప్పటికే ఈ విషయమ్మీద రఘురామ కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేసిన విషయం విదితమే. జాతీయ స్థాయిలో ఎంపీలందరికీ, ఈ విషయమై ప్రత్యేకంగా లేఖలు రాస్తున్న రఘురామ, వారి నుంచి సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది ఆంధ్రపదేశ్ పోలీస్ వ్యవస్థపై బురదచల్లే వ్యవహారంగా పలువురు అభిప్రాయపడుతున్నారు. నిజానికి, రఘురామపై ఏపీ సీఐడీ దాడి చేసిందనడానికి ఎలాంటి ఆధారాల్లేవు.
ఈ విషయాన్ని ఏపీ సీఐడీ ఇప్పటికే స్పష్టం చేసింది. రఘురామ డ్రామాలు ఆడుతున్నారన్నది రాష్ట్ర ప్రభుత్వం వాదన. అయితే, రఘురామ కాళ్ళ మీద గాయాలు మాత్రం అయ్యాయి. అవెలా తగిలాయి.? అన్నదే ఇక్కడ మిలియన్ డాలర్ల ప్రశ్న.
ప్రజల్లో సింపతీ పొందడానికి రఘురామ గత కొద్ది రోజులుగా చేస్తున్న ఫీట్లు అలాంటిలాంటివి కాదు. రాజద్రోహం కేసులో అరెస్టయి, బెయిల్ పొందినా.. మీడియాతో మాట్లాడటానికి బెయిల్ షరతులు అడ్డం వస్తున్నాయి రఘురామకి.
లేకపోతే, ఈయన నోటి నుంచి ఇంకెలాంటి భాష వచ్చి వుండేదో ఆలోచించుకుంటేనే జుగుప్స కలుగుతుంది. ఇంతకీ, రఘురామ కోరుకున్నమద్దతు ఆయనకు జాతీయ స్థాయిలో లభిస్తుందా? వేచి చూడాల్సిందే.