వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు, సొంతూరు నర్సాపురం వెళ్ళారు.. అదీ చాలాకాలం తర్వాత. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి నర్సాపురం ఎంపీగా గెలిచిన రఘురామ, ఆ తర్వాత వైసీపీకి షాక్ ఇచ్చి, వైసీపీ మీద తిట్ల పురాణం షురూ చేశారు.
అప్పటినుంచి రఘురామపై కేసులు, అరెస్టుల వ్యవహారం చేస్తూనే వున్నాం. సొంత ఊరు వెళ్ళలేని దుస్థితి రఘురామకృష్ణరాజుది.. నిన్న మొన్నటిదాకా. అయితే, ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో, రఘురామ ఈసారి రిస్క్ చేశారు.
కోర్టును ఆశ్రయించి, అరెస్టు నుంచి కాస్త ఉపశమనం పొందిన రఘురామ, స్వేచ్ఛగా సొంత నియోజకవర్గానికి వెళ్ళి, బలప్రదర్శన కూడా గట్టిగానే చేశారు. టీడీపీ – జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తానని రఘురామ ప్రకటించిన సంగతి తెలిసిందే. నియోజకవర్గంలో అభిమానులు, మద్దతుదారులైన నాయకులు బాగానే రఘురామ వెంట కనిపించారు.
అన్నట్టు, రఘురామ గట్టిగానే ఈ పర్యటన కోసం ఖర్చు చేశారట. అవుతుంది, ఖర్చు బాగానే అవుతుంది. అయినాగానీ, ఇదేమీ ఆయనకు పెద్ద విషయం కాదనుకోండి.. అది వేరే సంగతి.
అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం జనసేన నుంచే పోటీ చేయాలని రఘురామ యోచిస్తున్నారట. బీజేపీ కూడా ఈ కూటమిలోకి వస్తే, ఆయన తొలి ప్రాధాన్యత బీజేపీ అవుతుందని అంటున్నారు.
టీడీపీ అనేది చివరి ఆప్షన్ అట రఘురామకృష్ణరాజుకి. అయితే, ఏ పార్టీ నుంచి పోటీ చేసినా రఘురామ ఈసారి గెలిచే అవకాశం లేదంటూ నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఎక్కడ విన్నా ఒకటే అభిప్రాయం వ్యక్తమవుతోంది.