వైకాపా అదిష్టానం రెంబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుపై వేటుకు రంగం సిద్దం చేసిందా? గీత దాటిన రఘురామపై ఇక వేటేనా? అంటే అవుననే తెలుస్తోంది. ఎంపీ రఘురాం జగన్ సర్కార్ పై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేసి బయటకు వచ్చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వైకాపా-రఘురాం మధ్య మాటల యుద్ధం నడవడం…ఎంపీకి షోకాజ్ నోటీసు పంపడం…ప్రతిగా కేంద్రానికి ఎంపీ లేఖలు రాయడం….ఇటు సీఎం జగన్ కు రఘురాం లేఖ రాయడం చర్చనీయంశంగా మారింది. దీంతో అటు అదిష్టానం…ఇటు ఎంపీ తాడో? పేడో తేల్చుకోవడానికే సంసిద్ధమైనట్లు తేలిపోయింది. ఈ అంశాలన్నీ రాష్ర్ట రాజకీయాలలో అంతే హాట్ టాపిక్ గా నలిగాయి.
జగన్ సర్కార్ ఏడాది పాలనపై ఓ పక్క ప్రతిపక్షం టీడీపీ అదే స్థాయిలో విరుచుకుపడటం…ఇటు ఎంపీ సొంత పార్టీపైనే విమర్శలు అదిష్టానంకు భంగపాటుగా మారాయి. తాజాగా ఈ కథ కంచికి చేరినట్లే కనిపిస్తోంది. కృష్ణంరాజుపై అనర్హత వేటుకు వైకాపా ఎంపీలంతా సిద్దమవుతున్నారు. దీనిలో భాగంగా శుక్రవారం ఆ పార్టీ ఎంపీలు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాతో భేటీ కావాలని నిర్ణయించారు. వైకాపా ఎంపీలకు స్పీకర్ అపాయింట్ మెంట్ కూడా ఇచ్చారు. ఎంపీలంతా స్పీకర్ ను కలిసి రఘురాంపై వేటు వేయాలని లేఖ అందించనున్నట్లు సమాచారం. శుక్రవారం ప్రత్యేక విమానంలో వీరంతా ఢిల్లీకి ప్రయాణం అవుతున్నారు.
రేపు మధ్యాహ్నం స్పీకర్ ని కలుస్తున్నట్లు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది. రఘురాం వ్యవహారంపై స్పీకర్ తో ఎంపీలంతా కలిసి సమాలోచన చేయనున్నట్లు తెలుస్తోంది. రఘురామ వ్యాఖ్యలు సహా , ఏపీలో చోటు చేసుకున్న పరిస్థితులన్నింటిని స్పీకర్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. అయితే రఘురాం ఇప్పటికే అసెంబ్లీ స్పీకర్ ఓంబిర్లా ను కలిసి లేఖ అందించడం జరిగింది.