ఏపీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడి మార్పుపై ఒక్కో రాజకీయ పార్టీలో ఒక్కో విధంగా రెస్పాన్స్ ఉంది. మామూలుగా అయితే రాష్ట్రంలో బీజేపీకి ఉన్న బలం దృష్ట్యా వారిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కావడంతో పట్టించుకోవాల్సిందే. ఇక కన్నా లక్ష్మీనారాయణ స్థానంలో సోము వీర్రాజు నియమితులు కావడం తెలుగుదేశం పార్టీకి పెద్దగా మింగుడుపడినట్టు లేదు. కన్నా లక్ష్మీనారాయణ అయితే ఇన్నాళ్లు టీడీపీ మీద కొంచెం సాఫ్ట్ కార్నర్ ప్రదర్శించేవారు. అందుకే ఆయన పదవి నుండి దిగిపోవడం వారికి కొంత ఇబ్బందిగానే ఉన్నట్టుంది.
ఇక వైసీపీ అయితే కన్నా ఉద్వాసనతో సంబరాల్లో మునిగిపోయింది. అధికారికంగా సెలబ్రేషన్స్ లేవు కానీ సోషల్ మీడియాలో మాత్రం వైసీపీ కార్యకర్తలు సంతోషం పట్టలేకపోతున్నారు. టీడీపీ మీద జాలి చూపిస్తూనే తమకు మంచే జరిగింది అన్నట్టు, ఈ మార్పు తమ విజయమన్నట్టు జోష్ చూపిస్తున్నారు. అసలు రాష్ట్ర బీజేపీలో మార్పులు ఏమైనా జరిగితే స్పందించాల్సింది ఆ పార్టీకి మిత్ర పక్షమైన జనసేన. పైగా సోము వీర్రాజు, పవన్ మధ్యన మంచి సాన్నిహిత్యం ఉంది. కన్నా దగ్గరి కంటే వీర్రాజు వద్దే పవన్ ఇంకా స్వేచ్ఛగా ఉండే వీలుంది. కాబట్టి పవన్ హ్యాపీగా ఫీలైపోవాలి.
కానీ ఆయన సాధారణంగానే రియాక్ట్ అయ్యారు. సోము వీర్రాజుకు శుభాకాంక్షలు తెలిపి కలిసి పనిచేస్తాం అన్నారు. జనసేన శ్రేణులు కూడా నాయకులతో పనేమిటి మాకు పాలసీలు ముఖ్యం అన్నట్టు మామూలుగానే విషెస్ చెప్పి ఊరుకున్నాయి. కానీ వైసీపీనే తెగ హడావుడి చేస్తోంది. ఈ హడావుడి చూస్తే ఈ మార్పు వారికి చాలా కీలకమైనట్టు, ఆ మార్పు కోసం వారు కష్టపడ్డట్టు ప్రొజెక్ట్ అవుతోంది. మరి నిజానిజాలు ఏమిటి, తెర వెనుక రాజకీయాలు ఎలా నడుస్తున్నాయి, రహస్య స్నేహాల్లో ఎవరెవరు ఉన్నారు అనేది ఆయా పార్టీల అధ్యక్షులకే ఎరుక.