వైఎస్సార్ బొమ్మ‌లేకుండా లేడీ ఎమ్మెల్యే ప్ర‌చారం!

చిల‌క‌లూరి పేట వైకాపా ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జిని పుట్టిన రోజు వేడుక‌లు నిన్న ఘ‌నంగా జ‌రిగాయి. వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో వేడుక‌లు అవ‌కాశం ఉన్నంత‌లో స్థానికంగా బాగానే నిర్వ‌హించారు. ఈ నేప‌థ్యంలో చిల‌క‌లూరి పేట‌లో ర‌జిని పోస్టర్లు పెద్ద ఎత్తును వెలిసాయి. అవ‌కాశం ఉన్న చోట పెద్ద పెద్ద హోర్డింగ్ లు ఏర్పాటు చేసారు. లేని చోట గోడ‌ల మీద పోస్ట‌ర్లు వేసారు. అయితే ఈ పోస్ట‌ర్ల‌లో ఎక్క‌డా వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఫోటోలు లేక‌పోవ‌డం ఎమ్మెల్యేని ఇబ్బందుల్లోకి నెట్టింది. దీంతో ర‌జినీపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ర‌జినీపై వైకాపా నేత‌లు కావాల‌నే ఆమె వైఎస్సార్ బొమ్మలు వేయించ‌లేద‌ని ఆరోపిస్తున్నారు.

2019 ఎన్నిక‌ల ముందు వ‌ర‌కూ ర‌జిని టీడీపీలో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఉన్నంతకాలం అప్ప‌టి ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్న వైకాపా అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై ప‌దునైన‌ మాట‌ల దాడి చేసిన నేత‌గా ఆమెకు రికార్డు ఉంది. అయితే ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డేస‌రికి టీడీపీ ప‌నై పోవ‌డంతో ర‌జిని వైకాపాలోకి జంప్ అయ్యారు. అటుపై టీడీపీ పార్టీ నుంచి పోటీ చేసిన సీనియ‌ర్ నేత ప‌త్తిపాటి పుల్లారావుని ఓడించి గెలిచారు. అయితే ఇదంతా వైఎస్సార్ చ‌ల‌వ అని చెప్పాల్సిన ప‌నిలేదు. గెలిచిన 151 సీట్లు కూడా వైఎస్సార్ బొమ్మ చూసి ప‌డిన ఓట్లే. జ‌గ‌న్ టిక్కెట్ ఇచ్చిన క్యాండెట్ తో ప‌నిలే కుండా ప్ర‌జ‌లు ఓటేసి 151 సీట్ల‌తో అఖండ మెజార్టీని ఇచ్చారు.

ఇది క్యాండెట్ల గొప్ప‌త‌నం కాదు. కేవ‌లం వైఎస్సార్ గొప్ప‌త‌నం. అయితే ర‌జిని ఇప్పుడు చిల‌క‌లూరి పేట ప్ర‌జ‌లు త‌న‌ని చూసే ఓట్లేసారు అన్నంత‌గా నియోజ‌క వ‌ర్గంలో గొప్ప‌లు పోతున్నారుట‌. ఈ నేప‌థ్యంలోనే ఆమె పుట్టిన రోజు వేడుక‌ల్లో వైఎస్సార్ బొమ్మ లేకుండా చేసార‌ని స్థానిక‌ వైకాపా నేత‌లు మ‌డిప‌డుతున్నారు. నియోజ‌క వ‌ర్గం ప్ర‌జ‌లు సైతం ఈ విష‌యంలో ర‌జ‌నీ పై అసంతృప్తిగానే ఉన్నార‌ని స‌మాచారం. మ‌రి ఈ విష‌యాన్ని అదిష్టానం సీరియ‌స్ గా తీసుకుంటుందా? లైట్ తీసుకుంటుందా? అన్న‌ది చూడాలి.