ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం తీర్పుని రిజర్వ్ చేసిన విషయం విదితమే. నిన్ననే తీర్పు వెల్లడి కావాల్సి వుంది. అయితే, అక్రమాస్తుల కేసులో ఏ2గా వున్న విజయసాయిరెడ్డి బెయిల్ కూడా రద్దు చేయాలని మరో పిటిషన్ దాఖలు చేశారు రఘురామ. ఆ పిటిషన్ మీద కూడా విచారణ పూర్తయ్యింది. రెండు పిటిషన్లపై తీర్పు సెప్టెంబర్ 15న వెల్లడించనున్నట్లు న్యాయస్థానం పేర్కొంది. అయితే, తొందరపడి ఓ కోయిల.. ముందే కూసింది.. అన్నట్టు వైసీపీ మీడియా, ‘వైఎస్ జగన్ బెయిల్ రద్దు పిటిషన్ కొట్టివేత..’ అంటూ ప్రచారం షురూ చేసింది. ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వైసీపీ మీడియా ప్రకటించేసరికి, అంతా అవాక్కయ్యారు. సోషల్ మీడియా వేదికగా ఈ అంశంపై పెద్ద రచ్చే జరుగుతోంది. ‘సదరు జర్నలిస్టుపైనా మీడియా సంస్థపైనా చర్యలు తీసుకోవాలి..’ అనే డిమాండ్లు పెరుగుతున్నాయి.
సమాచార లోపంతో ఇలాంటివి జరగడం మామూలే. గతంలోనూ ఇలాంటి చిత్ర విచిత్రమైన వ్యవహారాలు చాలానే జరిగాయి. అయితే, ఇది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సంబంధించిన అంశం కావడం, వైసీపీ మీడియాలో ఆ తరహా కథనాలు రావడంతో.. ఈ వ్యవహారానికి మరింత ప్రాధాన్యత ఏర్పడిందంతే. ఇందులో నిజానికి ఎవర్నీ తప్పు పట్టడానికి వీల్లేదు. కానీ, ఇంతటి సున్నితమైన అంశం విషయంలో తొందరపాటు.. చేటు చేస్తుంది. మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశ్వసనీయతను దెబ్బతీస్తుంది. ‘స్వామి భక్తి’తో ఇలాంటి అత్యుత్సాహపూరిత కార్యక్రమాలు చేపట్టేవారి పట్ల ఒకింత అప్రమత్తంగా వుండాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి మీదనే వుంది. ‘అందులో తప్పు రాస్తారు అధ్యక్షా..’ అని అసెంబ్లీ సాక్షిగానే వైసీపీ మీడియా గురించి వైఎస్ జగన్ చెప్పుకొచ్చిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించుకోవాల్సిందే మరి.