YCP Ex Ministers : వైసీపీ మాజీ మంత్రులంతా ఎందుకు ‘క్యూ’ కడుతున్నట్టు.?

YCP Ex Ministers :  మూడేళ్ళు మంత్రులుగా పని చేసి, ఆ సమయంలో నానా హంగామా చేసిన వైసీపీ నేతలు, పదవులు పోగానే సైలెంటయిపోయారు. వుంటుంది మరి, ఆ మాత్రం బాధ.! అందుకే, కొన్నాళ్ళపాటు మౌనం దాల్చక తప్పలేదు. కొందరు అసహనం వ్యక్తం చేసి, తమ కార్యకర్తల్ని అనుచరుల్ని.. రోడ్డెక్కించి ఆందోళనలు చేయించినా, అధిష్టానం తీసుకున్న ‘చర్యల’ కారణంగా అందరూ దార్లోకి వచ్చేశారు.

ఇదిలా వుంటే, మాజీ మంత్రులు ఒకరొకరుగా మళ్ళీ యాక్టివ్ అవుతున్నారు. కొడాలి నాని, పేర్ని నాని, అవంతి శ్రీనివాస్.. ఇలా ఒకరొకరుగా మీడియా ముందుకొచ్చి, తమ అధినేత పట్ల తమకున్న నమ్మకాన్ని నొక్కి వక్కాణిస్తున్నారు. ‘మేమెందుకు వైసీపీని వీడతాం.?’.. ‘మాకెందుకు పదవులు పోతే అసంతృప్తి వుంటుంది.?’ అంటూ అమాయకంగా ప్రశ్నించేస్తున్నారు.

అయితే, పదవులు పోగొట్టుకుని మాజీలైనవారిలో కొందరు ఇతర పార్టీలతో టచ్‌లోకి వెళ్ళిన వైనంపై వైసీపీ అధిష్టానానికి ఖచ్చితమైన అవగాహన వుంది. అలాంటోళ్ళని ఎక్కడ నొక్కాలో వైసీపీ అధిష్టానానికి బాగా తెలుసు. అలా నొక్కుతుండడం వల్లే, ఒకరొకరుగా బయటకొస్తున్నారంటూ రాజకీయ వర్గాల్లో సెటైర్లు పడుతున్నాయి.

‘అబ్బే, అలాంటిదేమీ లేదు..’ అని తాజా మాజీలు ఏం చెప్పినాగానీ, తెరవెనుక వ్యవహారాలు.. ఆయా నేతల సన్నిహితుల కారణంగానే లీకుల రూపంలో బయటకు వస్తుండడం గమనార్హం.

ఒక్కటి మాత్రం నిజం.. వైఎస్ జగన్ గనుక ముందస్తు ఆలోచనలు చేస్తే.. ఈక్వేషన్స్ రాత్రికి రాత్రి మారిపోతాయ్. ఇప్పుడు జగన్‌ని పొగుడుతున్నవారిలో సగానికి పైగా నేతలు, జగన్ మీద విమర్శలు మొదలెట్టేస్తారు.!