కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 25 లక్షల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. కోవిడ్ మరణాలతో కలిగే నష్టాన్ని అంచనా వేయడానికి చేపట్టిన అధ్యయనంలో విస్మయానికి గురిచేసే విషయాలు వెల్లడయ్యాయి. కోవిడ్ మహమ్మారి 25 లక్షల మందిని బలితీసుకోగా.. తత్ఫలితంగా సుమారు 2 కోట్ల ఏళ్ల జీవితకాలాన్ని ప్రపంచం నష్టపోయిందని అధ్యయనం పేర్కొంది.
భారత్ సహా 81 దేశాలకు చెందిన కరోనా మరణాల సమాచారాన్ని విశ్లేషించిన అనంతరం అంతర్జాతీయ యూనివర్సిటీలు, పరిశోధన సంస్థలకు చెందిన పరిశోధకులు ఈ విషయాన్ని వెల్లడించారు. అధ్యయన ఫలితాలను ‘సైంటిఫిక్ రిపోర్ట్స్’ జర్నల్‌లో ప్రచురించారు. కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి సరాసరి ఆయుష్షును లెక్కించిన పరిశోధకులు.. వారి కారణంగా 2,05,07,518 సంవత్సరాల జీవితకాలాన్ని కోల్పోయినట్టు అంచనా వేశారు. వ్యక్తిగతంగా సగటున 16 ఏళ్ల జీవితకాలం కోల్పోయినట్టు పేర్కొన్నారు.
సాధారణ ఫ్లూ, హృద్రోగ వ్యాధుల వల్ల కలిగే ఇయర్స్ ఆఫ్ లైఫ్ లాస్ట్ (వైఎల్ఎల్) కంటే ఈ నష్టం 25 నుంచి 50 శాతం ఎక్కువని తేల్చారు. జీవిత కాలం కోల్పోయిన రేటు ఒక వ్యక్తి మరణించే వయసు, వారి ఆయుర్దాయం మధ్య వ్యత్యాసం. సీజనల్ ఫ్లూ కారణంగా కోల్పోయిన జీవితకాలం రేటు కంటే కరోనా కారణంగా 2-9 రెట్లు ఎక్కువ కోల్పోయినట్టు అధ్యయనం పేర్కొంది. జీవితకాలం కోల్పోయినవారిలో 55 నుంచి 75 ఏళ్లవారు 44.9 శాతం, 55 ఏళ్లలోపు 30.2 శాతం, 75 ఏళ్లు దాటినవారు 25 శాతం ఉన్నట్టు అధ్యయనం తెలిపింది.