తెలంగాణలో కరోనా మహమ్మరి మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో సినిమా థియేటర్లు మళ్లీ మూతపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. ఒకవేళ థియేటర్లు పూర్తిస్థాయిలో మూసివేత సాధ్యం కాకుంటే సగం సీట్లు మాత్రమే నింపుకునేలా నిబంధనలు విధించాలని సూచించింది. తెలంగాణలో ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతోందని, పరిస్థితి ఇలాగే కొనసాగితే చేయి దాటిపోయే ప్రమాదం ఉందని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వరుసగా కొత్త సినిమాలు విడుదలవుతుండటంతో థియేటర్లు 90 శాతంపైగా నిండిపోతున్నాయని, ప్రేక్షకులు మాస్కులు ధరించకుండా పక్క పక్క సీట్లతో కూర్చోవడం వల్ల ప్రమాద తీవ్రత పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు. పైగా తలుపులన్నీ మూసివేసి ఏసీ వేస్తుండటంతో కేసులు భారీగా పెరుగుతున్నాయన్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని సినిమా హాళ్లు, జిమ్‌లు, ప్రజలు గుమిగూడే అవకాశం ఉన్న సముదాయాల్లో కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేయాలని ప్రతిపాదించినట్లు అధికారులు తెలిపారు.
అయితే దీనిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇప్పటికే వైద్య, ఆరోగ్యశాఖ ప్రతిపాదన మేరకు ప్రభుత్వం బుధవారం నుంచి విద్యా సంస్థలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. విద్యాసంస్థలను మూసివేయాలని పది రోజుల క్రితమే తాము ప్రతిపాదించామని, నిర్ణయం ఆలస్యంగా తీసుకున్నారని అధికారులు చెబుతున్నారు. పరిస్థితి తీవ్రరూపం దాల్చే అవకాశం ఉన్నందున సినిమా థియేటర్ల విషయంలో వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకుంటే మంచిదని అభిప్రాయపడుతున్నారు.